బ్లాస్ట్ కాదు.. నాణ్యత లోపమే..?
సాక్షి పెద్దపల్లి: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల – పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల మధ్య మానేరుపై చెక్‌డ్యాం ధ్వంసం కావడానికి నాణ్యత లోపమే కారణమని పోలీస్ విచారణలో తేలినట్లు సమాచారం. అందరూ ఊహించినట్లు ఇసుక మాఫియా హస్తం లేదని విచారణలో తేలినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి గుంపుల చెక్‌డ్యాం కూలిన విషయం తెలిసిందే. ఇసుక తోడుకునేందుకు ఇసుక మాఫియానే జిలెటెన్‌స్టిక్స్‌తో చెక్‌డ్యాంను పేల్చినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనివెనుక ఇసుక అక్రమార్కుల హస్తం ఉందని ఏకంగా ఇంజినీరింగ్ అధికారులే జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గుంపుల చెక్‌డ్యాం కూలిపోవడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన ముగ్గురు జాలరులను గుర్తించి ప్రశ్నించగా.. శుక్రవారం సాయంత్రం 6.30 ప్రాంతంలో చెక్‌డ్యాం కూలిపోయిందని చెప్పినట్లు సమాచారం. చెక్‌డ్యాం కుంగినప్పుడు అక్కడే తాము ఉన్నామని ఆ మత్స్యకారులు ఇచ్చిన వాంగ్ములం ఆధారంగా దీని వెనుక ఎవరిహస్తం లేదని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. దీనికితోడు డ్యాంను బాంబులతో కూల్చివేసినట్లు ఆనావాళ్లు కానరాలేదని, అదేవిషయం ఫోరెన్సిక్ నివేదికలోనూ వెల్లడైనట్లు సమాచారం. బాంబలతో పేల్చితే పేలుడు పదార్థాల అవశేషాలు, పరిసర ప్రాంతాల్లో ఉపయోగించిన రసాయనాల (నైట్రోజన్ సమ్మేళనాలు, టీఎన్‌టీ మొదలైనవి) లభి స్తాయి. అలాగే భారీ పేలుడు జరిగినచోట గొయ్యి ఏర్పడుతుంది. ముఖ్యంగా కాంక్రీట్ రంగు మారడం, పగుళ్లపొరలుగా ఊడిపోవడం, పేలుడు పరికరాల భాగాలు.. అంటే స్విచ్‌లు, వైర్లు, టైమర్‌లు, సర్క్యూట్ బోర్టుల వంటివి పేలుడు ప్రదేశంలో లభిస్తాయి. కానీ, ఇవేమీ డ్యాం కూలిన ప్రదేశంలో కనిపించలేదని పోలీస్, ఫోరెన్సిక్ విచారణలో వెల్లడైనట్లు సమాచారం. దీంతో కేవలం డిజైన్, నాణ్యత లోపమే కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉపనదులు, వాగుల నీటి ప్రవాహాలను ఆపి, నీటిని నిల్వ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం చెక్‌డ్యాంలను నిర్మించింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 16 చెక్‌డ్యాంలను రూ.128 కోట్లతో గత ప్రభుత్వం హయాంలో నిర్మించారు. అయితే, నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, డిజైన్ లోపాలు, నిర్మాణ ప్రదేశం ఎంపికలో లోపాలతో పలు చెక్‌డ్యాంలు వరదల సమయంలో కొట్టుకపోయాయని, ప్రస్తుత చెక్‌డ్యాం సైతం కూలిపోవడానికి అదే కారణమని అధికారులు చెబుతున్రాఉ. దీంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో 13 చెక్‌డ్యాంలు నిర్మిస్తే 8 చెక్‌డ్యాంలు కృంగిపోయాయని గుర్తించినట్లు సమాచారం. చెక్‌డ్యాంకు బాంబులు పెట్టి పేల్చిన ఆనవాళ్లు కనబడటంలేదని, డ్యాంకు మధ్య, ముందు భాగంలో బుంగలు ఏర్పడడంతో చెక్‌డ్యాం కూలిపోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీస్ ఉన్నాతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
గుంపుల చెక్‌డ్యాం కుంగుబాటుకు కారణం నాణ్యత లోపమే
ఫోరెన్సిక్ నివేదికలో కానరాని బ్లాస్టింగ్ ఆనవాళ్లు
పోలీస్ విచారణలో ప్రత్యక్ష సాక్షుల వాంగ్ములం


