నిలిచిన వంతెనలు.. జనం తిప్పలు | - | Sakshi
Sakshi News home page

నిలిచిన వంతెనలు.. జనం తిప్పలు

Aug 21 2025 6:44 AM | Updated on Aug 21 2025 6:44 AM

నిలిచిన వంతెనలు.. జనం తిప్పలు

నిలిచిన వంతెనలు.. జనం తిప్పలు

● అర్ధాంతరంగా ఆగిపోయిన వంతెనల నిర్మాణం ● పనుల పూర్తిపై దృష్టి పెట్టని కాంట్రాక్టర్లు

కోరుట్ల: జిల్లాలో పంచాయతీ రాజ్‌, రోడ్లు భవనాల శాఖల పరిధిలో సుమారు 15 చోట్ల వంతెనల పనులు అర్ధాంతరంగా నిలిచాయి. రూ.3 కోట్ల అంచనాతో నిర్మించతలపెట్టిన ధర్మపురి నియోజకవర్గంలోని గొల్లపల్లి మండలం దట్నూర్‌ వంతెన, జగిత్యాల పరిధిలో రూ.3 కోట్లతో ప్రతిపాదించిన రాయికల్‌–మైతాపూర్‌, రూ.1.50 కోట్లతో రాయికల్‌–రామోజీపేట వంతెనలు నిర్మాణంలో ఉన్నాయి. రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన సారంగాపూర్‌ మండలం బట్టపల్లి వంతెన పనులు పూర్తి కాలేదు. సుమారు రూ.9 కోట్లతో రాయికల్‌ మండలం ఇటిక్యాల–రామరావుపల్లె బ్రిడ్జి పనులు ముందుకు కదలడం లేదు. రూ.50 లక్షల వ్యయంతో అంచనాలు వేసి కొత్తగా టెండర్లకు సిద్ధంగా ఉన్న మల్లాపూర్‌ మండలం రాంరావుపల్లి–రేగుంట వంతెన పనులు మొదలు కాలేదు. వేములవాడ నియోజకవర్గంలో రూ.4.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన తక్కళ్లపల్లి–సిరికొండ వంతెన అసంపూర్తిగా ఉంది. కోరుట్ల పరిధిలోని కోరుట్ల–సంగెం బ్రిడ్జి రూ.3.80 కోట్లలో కొంత వెచ్చించినా.. అర్ధాంతరంగా నిర్మించి వదిలేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన గోధూర్‌–వర్షకొండ వంతెన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.1.50 కోట్లతో నిర్మించితలపెట్టిన వర్షకొండ–మూలరాంపూర్‌ వంతెన పూర్తి కాలేదు. మెట్‌పల్లి మండలం ఆత్మకూర్‌–పాటిమీద తండా వంతెన రూ.65 లక్షలతో అంచనాలు వేసినా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా చాలా చోట్ల వంతెనల నిర్మాణాలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి.

నిధులు రాకపోవడంతోనే..

అర్ధాంతరంగా వంతెనలు నిలిచిపోవడానికి ప్రధాన కార.. సకాలంలో బిల్లులు అందకపోవడమేనన్న వాదనలు వినవస్తున్నాయి. జిల్లాలో ఓ వైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌.. మరోవైపు విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ప్రగతిలో ఉన్న వంతెలకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు కాలేదు. వంతెనల పూర్తికి అవసరమైన నిధుల మంజూరులో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. దీంతో కాంట్రాక్టర్లు బ్రిడ్జిల నిర్మాణం పనులు మధ్యలోనే ఆపేశారు. ఫలితంగా భారీ వర్షాలకు జనం నానా తిప్పలు పడుతున్నారు. పక్కనే ఉన్న అప్రోచ్‌ రోడ్ల నుంచి వాహనాలను తీసుకెళ్లడం సాధ్యం కాక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల రాకపోకలు ఆగిపోయాయి. ఆగిపోయిన బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంలో కీలక నేతలు ప్రేక్షకపాత్ర వహించడంతో భారీ వర్షాలకు జనం ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఈ చిత్రంలో కనిపిస్తున్నది గొల్లపల్లి మండలం దట్నూర్‌ వంతెన. కేవలం పిల్లర్ల వరకు నిర్మాణమై పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బిల్లులు రాకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఈ వంతెన వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఫలితంగా ఆ పరిసర ప్రాంతాల జనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెన పూర్తయితే తమ కష్టాలు తీరుతాయని అంటున్నారు. విశేషమేమంటే.. ఇదీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఇలాకాలోని వంతెన కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement