
బహిరంగ ప్రదేశంలో కోడె టికెట్లు ?
● ఉద్యోగుల తీరుపై అనుమానాలు
వేములవాడ: రాజన్న ఆలయంలో ప్రధాన మొక్కు అయిన కోడె టికెట్లు ఆలయం బయట ప్రదేశంలోకి రావడం కలకలం రేపాయి. కోడెమొక్కు చెల్లించే భక్తులు రూ.200 పెట్టి టికెట్ కొని కోడెతో ప్రదక్షిణ చేసి ప్రధాన ద్వారానికి ఎదురుగా కట్టేస్తారు. ఈక్రమంలో కోడె టికెట్లు పరిశీలించేందుకు రెండు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది కోడె టికెట్లు తీసుకుని చించివేస్తారు. అయితే ఆ చించివేసిన టికెట్లు సోమవారం ఆలయంలోని స్వామి వారి ఓపెన్‌స్లాబ్‌పై దర్శనమిచ్చాయి. ఇక్కడి ఎలా వచ్చాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆలయ ఉద్యోగులే రీసైక్లింగ్ చేస్తూ డబ్బులు దండుకునేందుకు ఇలా తెచ్చి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఈవో రాధాభాయి మాట్లాడుతూ గతంలో ఈ టికెట్లను ఓపెన్‌స్లాబ్‌పై వేసి ఉంటారని, ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బందిని విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇసుక వివాదం..
● ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం
● నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు
● విచారణ చేపట్టిన మెట్‌పల్లి డీఎస్పీ రాములు
మెట్‌పల్లి రూరల్: ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్‌పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్‌రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కేశిరెడ్డి నవీన్‌రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్‌పల్లి డీఎస్పీ రాములు సోమవారం ఆత్మకూర్‌కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ ఉన్నారు.
నిండుకుండలా ఎగువమా‘నీరు’
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టు నిండుకుండలా మా రింది. ఎగువ ప్రాంతాలైన కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడవెల్లి వా గుల ద్వారా వరద నీరు జలాశయంలోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం రెండు టీఎంసీలు(31అడుగులు) కాగా.. ప్రస్తుతం 1.61టీఎంసీలు (29అడుగులు) నీటి మట్టం ఉంది. దాదాపు 1,080 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఇదే వరద కొనసాగితే ఒకటి, రెండు రోజుల్లో ప్రాజెక్టు పరవళ్లు తొక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరీవాహక వాగు ప్రాంత రైతులు, పశువుల, గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మారుతిరెడ్డి సూచించారు. వాగుల వద్దకు చేపల వేటకు ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు.