
విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత
పెగడపల్లి: జిల్లావ్యాప్తంగా విద్యుత్ శాఖలో ఖాళీల కొరత వేధిస్తోంది. కిందిస్థాయి సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఏటా పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లకు సరిపడా సిబ్బంది పోస్టులు భర్తీ కావడం లేదు. ఉన్నవారిపైనే అదనపు భారం పడుతుండటంతో ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రైవేటు ఎలక్ట్రిషీయన్లు రోజువారి కూలీలుగా పనిచేస్తుండటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాకాలంలోనే ఎక్కువగా విద్యుత్ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అక్కడక్కడ సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నా ఇబ్బంది మాత్రం తప్పడం లేదు. ఇద్దరుముగ్గురు చేసే పనిని ఒక్కరే చేయాల్సి రావడంతో వినియోగదారులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది. జిల్లాలో ఏటా గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెరుగుతున్నా.. దానికి తగ్గట్టు సిబ్బందిని నియమించడం లేదు. ఒక్కో డివిజన్‌లో పరిధిలో ప్రతి 1500 సర్వీసులకు ఒక జూనియర్ లైన్‌మన్, ప్రతి మూడు వేల కనెక్షన్లకు అసిస్టెంట్ లైన్‌మెన్, ప్రతి 4500 విద్యుత్ కనెక్షన్లకు లైన్‌మన్, లైన్‌ఇన్‌స్పెక్టర్ ఉండాలి. సెక్షన్ మొత్తానికి ఒక సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్, ఫోర్‌మన్ ఉండాలి. కానీ.. ఉండాల్సిన నిష్పత్తిలో ఎక్కడా సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది కొరతతో వ్యవసాయ బావుల వద్ద ఫ్యూజ్‌లు పోతే పునరుద్ధరణ ఆలస్యం అవుతోంది. గ్రామాల్లోనూ రాత్రిపూట ఫ్యూజ్‌లు పోతే పెట్టడానికి ఎవరూ అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణులున్నాయి. వారు వచ్చేలోపు రైతులు, స్థానికులే సరిచేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యుత్ ప్రమాదాల బారిన పడుతున్నారు. జిల్లాలో జేఎల్‌ఎం, ఏఎల్‌ఎం పోస్టులు ఎక్కువగా ఖాళీలున్నాయి. ఈ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. 2019లో జేఎల్‌ఎం పోస్టులు భర్తీ కాగా.. ఏడాది విధులు పూర్తి చేసుకున్న వారందరూ ఏఎల్‌ఎంలుగా పదోన్నతి పొందారు. జేఎల్‌ఎం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న వారిపై పని భారం పడుతుండటంతో ఒత్తిడికి గురవుతున్నామని వాపోతున్నారు. ఏ రాత్రయినా విద్యుత్ పునరుద్ధరణకు క్షేత్రస్థాయి సిబ్బందే పనులు చేయాల్సి వస్తోంది. అత్యవసర సమయంలో వెళ్లాలంటే మరో సిబ్బంది అదనంగా పని చేయాల్సి వస్తోందని చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
పోస్టులు, ఖాళీల వివరాలు
హోదా పోస్టులు ఉన్నది ఖాళీలు
జూ.లైన్‌మెన్లు 207 21 186
అ.లైన్‌మెన్లు 207 189 18
లైన్‌మెన్లు 151 146 05
లైన్ ఇన్‌స్పెక్టర్లు 61 61 03
సీ.లైన్‌స్పెక్టర్లు 21 19 02
ఫోర్‌మెన్లు 11 7 04
అ.ఇంజినీర్లు 51 49 02
డి.ఇంజినీర్లు 16 13 03
జిల్లాలో సబ్ డివిజన్లు 09
గృహ విద్యుత్ కనెక్షన్లు 3,41,104
కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు 43,825
ఇండస్ట్రియల్ విద్యుత్ కనెక్షన్లు 4,374
వ్యవసాయ కనెక్షన్లు 1,38,689
మొత్తం కనెక్షన్లు 5,37,780