
వర్షంలో పనులు.. నాణ్యత కరువు
పోసింది పోసినట్టే కొట్టుకుపోతున్న సీసీ రోడ్లు కొన్నిచోట్ల ఆలస్యం.. మరికొన్ని చోట్ల హడావుడి అసంపూర్తి పనులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
జగిత్యాల: అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలని, నాణ్యతగా లేకుండా చేస్తే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ప్రతి వార్డు తిరుగుతూ.. పనులను పర్యవేక్షిస్తూ.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నారు. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న పనుల్లో నాణ్యత లోపిస్తోంది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల నెలలు తరబడినా చేయకపోవడం, మరికొన్ని చోట్ల కొబ్బరికాయ కొట్టి నెలలు గడిచినా రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు. జగిత్యాల బల్దియాకు టీయూఎఫ్‌ఐడీసీ కింద రూ.20కోట్లు మంజూరయ్యాయి. ప్రతి కాలనీలో సీసీరోడ్డు పనులు చేపడుతున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. నాణ్యత లేదంటూ స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనిపించని నాణ్యత
సీసీరోడ్లు మొదలుపెట్టాక.. పొక్లెయిన్‌తో లేయర్ తీసి తర్వాత చిన్న కంకరపోయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు కంకర పోస్తే చాలా ఖర్చు అవుతుందని ఎక్కడైనా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన గార్బెజ్ తీసుకొచ్చి ఆ లేయర్‌పై పోస్తున్నారు. నాణ్యమైన మొరం పోయాల్సి ఉండగా.. ఎక్కడిదో తీసుకొస్తున్నారు. నిత్యం పర్యవేక్షించాల్సిన వర్క్ ఇన్‌స్పెక్టర్, ఏఈలు గానీ పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టర్లు చెత్తాచెదారం పోసి నింపుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కాలనీలో ఫిర్యాదు చేస్తే చిన్నపాటి కంకర నింపుతూ మమ అనిపిస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ ఎక్కడ?
నిబంధనల ప్రకారం సీసీరోడ్డు నిర్మించేటప్పుడు ఎంత సిమెంట్ వాడుతున్నారు..? ఎంత ఎంఎం కంకర వేస్తున్నారు..? వంటి అంశాలను అధికారులు పని పూర్తయ్యేవరకూ పరిశీలిస్తూ ఉండాలి. కానీ పర్యవేక్షణ లేకపోవడంతో నాణ్యత లేకుండా సీసీరోడ్లను నిర్మిస్తున్నారు కాంట్రాక్టర్లు. ఫలితంగా వేసిన రెండుమూడు నెలల్లోనే చెడిపోతున్నాయి. కొందరు అధికారులు అమ్యామ్యాలకు అలవాటు పడి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీరోడ్డు మొదలు పెట్టాక కంకర పోయడంతో పాటు, దానిపై నాణ్యతతో కూడిన మొరం పోసి రోడ్డురోలర్‌తో చదును చేయాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో చదును చేసిన అనంతరం నాణ్యతతో కూడిన సిమెంట్ బస్తాలు కంకరతో కలిపి రోడ్డు వేయాల్సి ఉంటుంది. కానీ కొందరు కాంట్రాక్టర్లు నిబంధనలు గాలికి వదిలేస్తూ ఇష్టారాజ్యంగా చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రోడ్డంతా పూర్తయిన అనంతరం ఇటీవల వంచం డ్రై ఫ్యాన్ (వీడీఎఫ్) ద్వారా సీసీరోడ్డును నీట్‌గా చేయాల్సి ఉంటుంది. ఏదో రాత్రిపూట డ్రై ఫ్యాన్‌తో మీదమీద చేస్తూ మమ అనిపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లాలో చేపడుతున్న సీసీరోడ్లపై నిఘా ఉంచాలని, పూర్తిస్థాయిలో నిర్మితమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నాణ్యతతో ఉంటేనే బిల్లులు
నాణ్యతతో కూడిన సీసీరోడ్లు వేస్తేనే బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కాంట్రాక్టర్లు సీసీరోడ్డు వేసిన అనంతరం క్వాలిటీ అధికారులు పరిశీలించి ఏదో ఒకచోట డ్రిల్లింగ్ చేసి దానికి సంబంధించిన మెటిరియల్‌ను తీసుకెళ్లి నాణ్యత ఉందా..? లేదా..? అని చూస్తుంటారు. కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యతతో ఉన్న ఏదోచోటును చూపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏదో ఒక విధంగా బిల్లులు మంజూరు చేయించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
నాణ్యత
లేకుంటే చర్యలు
నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటాం. విద్యానగర్‌లో వాంచం డ్రైఫ్యాన్ ద్వారా రోడ్డును నీట్‌గా చేసి దానిపై పాలిథిన్ కవర్ కప్పుతున్నారు. వర్షానికి కొంత లేయర్ పోయింది. మళ్లీ రోడ్డు నాణ్యతగా చేసేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి చోట పకడ్బందీగా పర్యవేక్షణ చేస్తున్నాం. – అనిల్, ఏఈ

వర్షంలో పనులు.. నాణ్యత కరువు