
యూరియా కష్టాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్రచర్చ నడుస్తున్న వేళ.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశమైంది. పుట్టినరోజు జరుపుకున్న ఓ రైతుకు తోటి స్నేహితులు యూరియా బస్తా కానుకగా ఇచ్చారు. పైగా ఇప్పుడు ఇదే ట్రెండ్‌గా మారిందనే చర్చా నడుస్తోంది.
కథలాపూర్ మండలం తాండ్రియాలలో ముక్కెర మధు అనే రైతు పుట్టినరోజు నాడు.. అతని స్నేహితులు యూరియా బస్తాను బహుకరించారు. రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలను చూసి ఇచ్చామంటున్నారు. ఈ తరుణంలో.. ప్రభుత్వంపై సెటైర్ గా సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.
మొన్నీమధ్యే.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శత్రాజుపల్లి గ్రామంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కిషన్ రెడ్డి అనే రైతు పుట్టినరోజు సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చారు ఆయన మిత్రులు.
పలు జిల్లాల్లో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. క్యూ లైన్‌లలో పడిగాపులు పడలేక చెప్పులను ఉంచుతున్న దృశ్యాలు వెలుగులోకి రావడం చూశాం. అందుకే యూరియా కోసం ప్రభుత్వాన్ని బతిమాలడం చూస్తున్నాం. పంటలకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం మూలంగా ఏర్పడిందని పలు గ్రామాల్లో రైతులు వాపోతున్నారు.
అయితే విమర్శల వేళ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ స్పందించారు. రైతులకు ఎరువులు అందించడంలో కేంద్రం విఫలమైంది. సరిపడా యూరియాను అందించలేకపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు యూరియా కోసం పోరాడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా యూరియా బస్తాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేశారాయన.