
పాఠశాలల్లో ఏఐ
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ (ఏఐ) ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. హైటెక్ యుగంలో ఏఐ బోధన అందించాలన్న ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలోని 31 పాఠశాలలను గతేడాది ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ శిక్షణ, పాఠాలు చెప్పడంతో విద్యార్థులకు కోర్సుపై ఆసక్తి పెరిగింది. ఫలితంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఏఐని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
త్వరలోనే అన్ని పాఠశాలలకు..
త్వరలోనే అన్ని పాఠశాలల్లో ఏఐ పాఠాలు మొదలు కానున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మ్యాథ్స్ సబ్జెక్ట్‌లో ఒక పాఠ్యాంశంగా ఏఐని చేర్చారు. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఏఐ బుక్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ బుక్కులు అన్ని పాఠశాలలకు వచ్చాయి. దీనివల్ల ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థుల్లో డిజిటల్ నైపుణ్యాలు పెరిగే అవకాశం ఉంది.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక స్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిపై శిక్షణ కల్పిస్తున్నారు. కొత్తగా ఈ ఏఐ కోర్సును తీసుకురావడంతో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందనుంది. ఇప్పటికే జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ ఈ ఏఐపై శిక్షణ కల్పించారు.
రానున్నది అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీయే..
ప్రస్తుత హైటెక్ యుగంలో రానురాను ప్రతి ఒక్కరూ అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ పైనే ఆధారపడాల్సి ఉంటుంది. విద్యార్థులకు అదేస్థాయిలో చదువు అందించాలన్న ఉద్దేశంతో ప్రతి పాఠశాలలో దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గూగుల్ ప్లేస్టోర్‌కు వెళ్లి GCO MTQI అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దీని ద్వారా విద్యార్థులకు యాక్టివిటిస్ చేయించనున్నారు. ముఖ్యంగా డ్రా, ఏ స్కేర్ కోడింగ్ స్టెప్స్, క్లాస్ అండ్ షేప్స్ ఇతరత్రా అంశాలను దీని ద్వారా నేర్పించవచ్చు. విద్యార్థుల్లో ఈ అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ నైపుణ్యం పెరిగితే రానున్న కాలంలో ఎంతో ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలుంటాయి. అంతేకాక విద్యార్థుల్లో సృజనాత్మకత పెరగడంతోపాటు, కంప్యూటర్‌పై సైతం పట్టు ఉంటుంది. జిల్లాలో ఇప్పటివరకు 31 పాఠశాలల్లో మాత్రమే విద్యార్థులకు అందిన అర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ కోర్సు ప్రస్తుతం అన్ని పాఠశాలల్లో ఈ కోర్సు అందనుంది.
డిజిటల్ లర్నింగ్ పుస్తకాలు
ఏఐకి సంబంధించి డిజిటల్ లర్నింగ్ పేరుతో ప్రభుత్వం పుస్తకాలను రూపొందించి పలు పాఠశాలలకు పంపించడం జరిగింది. ఇందులో ఏఐ కోడింగ్, డాటా సైన్స్, డిజైన్ థింకింగ్, డిజిటల్ సిటిజన్ అనే అంశాలతో దాదాపు 21 పాఠ్యాంశాలను ముద్రించినట్లు విద్యాధికారులు పేర్కొన్నారు.
స్కూళ్లు 1,128
విద్యార్థులు 1,50,709
ఉపాధ్యాయులు 2,572

పాఠశాలల్లో ఏఐ