
సాగు భళా.. బ్యాంకులు కళకళ
జగిత్యాల అగ్రికల్చర్: ఓవైపు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వచ్చే వరదకాలువ నీటితో చెరువులు, కుంటలకు జలకళ. మరోవైపు వ్యవసాయ బావులు, బోర్లలో పుష్కలమైన నీటి వనరులు. ఫలితంగా జిల్లాలో ఆహార, వాణిజ్య పంటల ఉత్పత్తి పెరుగుతోంది. ఆధునాతన పద్ధతుల్లో వ్యవసాయం.. మహిళా రైతుల్లో కష్టపడేతత్వం ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. కొందరు ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లడం.. చాలామంది సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉండడంతో జిల్లా ఆర్థికంగా ముందు వరసలోనే ఉంది. దీంతో ఈ ప్రాంతంలో బ్రాంచీలు ఏర్పాటు చేసేందుకు వివిధ బ్యాంకులు పోటీపడుతున్నాయి.
129 బ్యాంకుల బ్రాంచీలు
మొన్నటివరకు జిల్లాలోని 20 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 60 నుంచి 70వరకు బ్రాంచీలు ఏర్పాటు చేశాయి. ఆర్థిక పరిపుష్టి నేపథ్యంలో మూడేళ్లలో 129కు పెంచాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో 65బ్యాంకు శాఖలు, మండలస్థాయిలో(సెమిఅర్బన్) 36, అర్బన్ (పట్టణస్థాయి)లో 28 బ్యాంకు శాఖలు ఖాతాదారులకు సేవలు అందిస్తున్నాయి. ఇందులో తెలంగాణ గ్రామీణ బ్యాంకు 29, యూనియన్ బ్యాంకు, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు 54, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు 30, సహకార బ్యాంకులు 16 శాఖలను ఏర్పాటు చేసి.. సేవలను కొనసాగిస్తున్నాయి. ఆయా బ్యాంకుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు ఖాతాదారులు బ్యాంకు సేవలు వినియోగించుకుంటున్నారు. జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా.. సగటున మూడు గ్రామాలకో బ్యాంకు శాఖలు ఉన్నాయి.
మూడు మండలాల్లో ఒక్కో శాఖే
వ్యాపారపరంగా పోటీపడుతున్న బ్యాంకులు ఎక్కువగా అర్బన్, సెమిఅర్బన్ స్థాయిలోనే బ్యాంకు శాఖలను ఏర్పాటు చేస్తూ.. గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్నాయి. ఇప్పటికీ సారంగాపూర్, బుగ్గారం, బీర్‌పూర్ మండలాల్లో ఒక్కో బ్యాంకు శాఖ మాత్రమే ఉన్నాయి. చుట్టుపక్క గ్రామాల ప్రజలు బ్యాంకు సేవల కోసం ఆయా ప్రాంతాలకు వెళ్లిరావడం కష్టంగా ఉంది. మండలాల వారీగా బ్యాంకు శాఖలను పరిశీలిస్తే జగిత్యాల అర్బన్‌లో 36, మెట్‌పల్లిలో 15, కోరుట్లలో 16, రాయికల్‌లో 6, కథలాపూర్‌లో 6, వెల్గటూర్‌లో 6, ధర్మపురిలో 6, మేడిపల్లిలో 5, మల్లాపూర్‌లో 5, కొడిమ్యాలలో 5, మల్యాలలో 5, పెగడపల్లిలో 4, గొల్లపల్లిలో 4, ఇబ్రహీంపట్నంలో 4, జగిత్యాల రూరల్‌లో 3, సారంగాపూర్‌లో 1, బీర్‌పూర్‌లో 1, బుగ్గారంలో 1 బ్యాంకు శాఖలు పనిచేస్తున్నాయి.
డిపాజిట్ల సేకరణలోను ముందంజ
రైతులు ఆర్థికంగా ఎదగడంతో బ్యాంకులు పోటీపడి డిపాజిట్లు సేకరించే పనిలో పడ్డాయి. 129 బ్రాంచ్‌ల ద్వారా 2020–21లో రూ.4,484.13 కోట్లు, 2021–22లో రూ.4,835.16 కోట్లు, 2022–23లో రూ.4,691.26 కోట్లు, 2023–24 (మార్చి 31 వరకు) రూ.5,524.58 కోట్లు డిపాజిట్లు సేకరించాయి. ఖాతాదారులకు అవసరమైన పంట రుణాలు, ధీర్ఘకాలిక రుణాలు, వ్యాపార రుణాలు అందించడంలోనూ బ్యాంకులు తమ పాత్ర పోషిస్తున్నాయి. 129 బ్రాంచ్‌ల ద్వారా 2021–22లో రూ.5,110.07 కోట్లు, 2022–23లో రూ.5,922.1 కోట్లు, 2023–24లో రూ.7,419.19 కోట్ల రుణాలు అందిస్తున్నాయి. ఖాతాదారులు బ్యాంకులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రుణాలను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నారు. రికవరీని 94 శాతం సాధిస్తున్నారు.