
కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు ఇళ్లు
జగిత్యాలరూరల్/సారంగాపూర్: కాంగ్రెస్ పాలనలోనే నిరుపేదలకు ఇళ్లు అందుతున్నాయని మాజీమంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టు గ్రామమైన జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌లో కడప లక్ష్మి, నరేశ్ నిర్మించుకున్న ఇంటిని ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎంపీటీసీ మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ గంగాధర్, మాజీ ఉపసర్పంచ్ నవీన్ పాల్గొన్నారు. అంతకుముందు జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ శివారులో నిర్మించిన రాజా బహాదూర్ వెంకట్రామిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. నిజాంకాలంలో వెనుకబడిన రెడ్డిలను ఆదుకునేందుకు వెంకట్రామిరెడ్డి హాస్టళ్లు ఏర్పాటు చేశారని కొనియాడారు.
ఏడాదిలోనే నాలుగు లక్షల ఇళ్లు
ఏడాదిలోనే రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలోని లచ్చక్కపేటలో ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నాయకులు రాంచంద్రారెడ్డి, సుధాకర్, శంకర్‌రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్, రవి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.