
వానొచ్చింది.. వరదొచ్చింది..
కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబరు 96662 34383
అధికారులను అలర్ట్ చేసిన కలెక్టర్‌ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వారికోసం కలెక్టరేట్‌లో టోల్‌ఫ్రీ నంబరు 96662 34383 ఏర్పాటు చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీసు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సారంగాపూర్/ఇబ్రహీంపట్నం/ధర్మపురి: జిల్లావ్యాప్తంగా శనివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండి మత్తడులు దూకుతున్నాయి. సారంగాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురిలో భారీ వర్షం కురిసింది. సారంగాపూర్‌లో వందలాది ఎకరాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల ఇసుక మేట వేసింది. సారంగాపూర్–బట్టపల్లి గ్రామాల మధ్య రోడ్డుపై నుంచి వరద పారడంతో రాకపోకలు నిలచిపోయాయి. రోళ్లవాగు ప్రాజెక్టులో నీటిమట్టం 12 అడుగులకు చేరింది. బీర్‌పూర్ మండలం తుంగూర్–కండ్లపల్లి గ్రామాల మధ్య వంతెన అప్రోచ్‌రోడ్డు కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలను ఎంపీడీవో భీమేష్, ఎస్సై రాజు రహదారిని మూసివేయించారు. పంచాయతీ కార్యదర్శులను కాపలాగా ఉంచారు. ఇబ్రహీంపట్నం మండలం యామపూర్, ఫకీర్‌కొండాపూర్ దారిలో వేసిన తాత్కాలిక రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. తహసీల్దార్ వరప్రసాద్ పరిశీలించి ఇరువైలా ట్రాక్టర్లను పెట్టారు. ధర్మపురిలో లోలెవల్ వంతెనలు మునిగి రాకపోకలు స్తంభించిపోయాయి. ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద, అనంతారం వద్దనున్న లోలెవల్ వంతెనలు పూర్తిగా మునిగిపోయాయి. ధర్మపురి నుండి జగిత్యాల వెల్లే వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఆకసాయిపల్లెలో సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. వంతెనపై ఉన్న చెత్తాచెదారాన్ని జేసీబీ సాయంతో తొలగించారు. వాహనాలు రాయపట్నం, మద్దునూర్, సిరికొండ, గొల్లపల్లి మీదుగా జగిత్యాలకు వెళ్లాయి. నృసింహుని ఆలయం డ్రైనేజీ పొంగిపొర్లడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై నీరు చేరి ఆ పరిసర ప్రాంతమంతా దుర్గందం వెదజల్లింది. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది డ్రైనేజీని శుభ్రం చేయడంతో మురుగునీరు వెళ్లిపోయింది.

వానొచ్చింది.. వరదొచ్చింది..