
రెండో బ్యాచ్ శిక్షణకు సర్వం సిద్ధం
జగిత్యాల: లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాల్లో భాగంగా రెండో బ్యాచ్ శిక్షణకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 18 నుంచి అక్టోబర్ 22 వరకు ఎంపిక చేసిన 123 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. భూభారతి చట్టాన్ని ప్రభుత్వం పకడ్బందీగా చేపడుతున్న నేపథ్యంలో సర్వేయర్లు తక్కువగా ఉండటంతో లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా మొదటి విడతలో 156 మందికి పైగా నూతన సర్వేయర్లను శిక్షణ ఇచ్చి రాత పరీక్ష నిర్వహించగా 60 మంది అర్హత సాధించారు. వీరికి త్వరలోనే లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం రెండో విడతలో 123 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరికి పరీక్షలు నిర్వహించి మండలాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. రెండో విడతలో సైతం ఈనెల 18 నుంచి అక్టోబర్ 22 వరకు శిక్షణ ఇస్తారు. అక్టోబర్ 26న థియరీ పరీక్షలు, 23 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.