
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి
● గొల్లపల్లిలో క్రీడా ప్రాంగణానికి భూమిపూజ ● ఏడెకరాల్లో నిర్మాణం: మంత్రి అడ్లూరి
గొల్లపల్లి: గొల్లపల్లి మండలకేంద్రంలోని క్రీడాకారులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన మాట నిలుపుకొన్నారు. సుమారు ఏడెకరాల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు బుధవారం భూమిపూజ చేశారు. ప్రభుత్వ విప్‌గా ఉన్న సమయంలో స్థానిక యువత క్రీడాప్రాంగణం ఏర్పాటు చేయాలని కోరగా.. హామీ ఇచ్చారు. తాజాగా యువతకు ఏడెకరాల స్థలం ప్రొసీడింగ్ కాపీని అందించారు. మైదానానికి ప్రత్యేక నిధులు కేటాయించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానన్నారు. అంతకుముందు శ్రీరాములపల్లి రైతు వేదికలో ఎస్సీ కార్పొరేషన్ ఆర్థిక సహాయంతో ఎస్సీ యువతకు కుట్టుమిషన్లు, సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ మాజీద్, ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీవో సురేశ్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
తప్పు చేసింది మీరు.. బద్నాం మాపైనా..?
జగిత్యాల: ‘తప్పు మీరు చేసి మమ్మల్ని బద్నాం చేస్తారా.. ?’ అని బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌పై మంత్రి అడ్లూరి మండిపడ్డారు. జిల్లాకేంద్రంలోని మెడికల్ గెస్ట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు. జీవో 17పై ప్రవీణ్‌కు అవగాహన లేదన్నారు. కోడిగుడ్ల కొనుగోలులో రూ.600 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలను ఖండించారు.
ప్రజలకు సత్వర సేవలు
వెల్గటూర్: ప్రజలకు సత్వర సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఎండపల్లిలో ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. కొద్ది రోజులుగా ఎండపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో కార్యకలాపాలు నిర్వహించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో అద్దె భవనంలో ఎంపీడీవో కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు.