
పదేళ్ల అనంతరం రేషన్‌కార్డులు
● పల్లె దవాఖానాల ద్వారా మెరుగైన వైద్యం ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
జగిత్యాల: రాష్ట్రంలో పదేళ్ల అనంతరం కొత్త రేషన్‌కార్డులు మంజూరవుతున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో మంగళవారం 1,597 కొత్త రేషన్‌కార్డులు, 17మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు, 44 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేసారు. నాగునూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానాను ప్రారంభించారు. రూ.17.60లక్షలతో సీసీ రోడ్డుకు భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. కస్తూరిబా బాలికల విద్యాలయంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, తహసీల్దార్ వాహిదొద్దీన్, ఎంపీడీవో గంగాధర్, మండల వైద్యాధికారి రాధారెడ్డి, ఆర్ ఐ వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మేం ఒరిజినల్..
రేషన్‌కార్డుల పంపిణీ సందర్భంగా మాజీమంత్రి జీవన్‌రెడ్డి వర్గీయులు రైతువేదిక వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్యే చుట్టూ ఆయన వర్గీయులు చేరడం.. జీవన్‌రెడ్డి వర్గం వారికి నిలబడేందుకూ స్థలం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వారికి కుర్చీలు వేయించారు. రేషన్‌కార్డుల పంపిణీకి తమను పిలవలేదని రైతువేదిక మెట్లపై బైఠాయించి తమది ఒరిజినల్ కాంగ్రెస్ అని, వారిది డూప్లికేట్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. జగిత్యాలరూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్, బీర్‌పూర్ ఎస్సైలు గీత, రాజు వారిని సముదాయించారు. నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉండి.. ఇప్పుడు కాంగ్రెస్ కండువాలు కప్పుకోకుంటే తాము ఎలా ఒప్పుకుంటామని నాయకులు వారితో వాదనకు దిగారు. నిరసన తెలిపిన వారిలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంచందర్‌రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు ఆసాది హరీశ్, చేకుట శేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు అప్పం స్వామి, నాయకులు ఉన్నారు. అయితే ఎమ్మెల్యేతో కలిసి తాజామాజీ ప్రజాప్రతినిధులు చెక్కులను పంచడం విమర్శలకు తావిచ్చింది.