
వణికిస్తున్న
మెట్‌పల్లి పట్టణంలోని ఓ వీధిలో
సంచరిస్తున్న కుక్కల గుంపు
మెట్‌పల్లి(కోరుట్ల): మెట్‌పల్లి మున్సిపాలిటీలో కుక్కల బెడదతో పట్టణవాసులు వణుకుతున్నారు. ఏ వీధిలో చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ప్రతినెలా వందలాది మంది వీటి బారినపడి గాయాల పాలవుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వార్డుల్లో రోజురోజుకు వీటి సంఖ్య పెరుగుతూ పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏడు నెలల్లో 1,870 మందికి కుక్కకాట్లు..
● పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి రికార్డుల ప్రకారం.. గడిచిన ఏడు నెలల్లో 1,870 మంది కుక్కల దాడిలో గాయాలపాలయ్యారు.
● ఇందులో మెట్‌పల్లితో పాటు ఇతర ప్రాంతాలకు చెందినవారూ ఉన్నారు.
● అయితే వీరిలో ఎక్కువగా పట్టణానికి చెందిన వారే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
● గతంలో ఏడాదంతా ఈ కేసుల సంఖ్య వందకు మించేవి కావు. కానీ, ప్రస్తుతం ఒక్క నెలలోనే వంద కంటే ఎక్కువగా నమోదవుతుండడం కుక్కల తీవ్రతకు అద్దం పడుతోంది.
సెంటర్ ఏర్పాటు.. అంతలోనే తరలింపు
● మెట్‌పల్లి మున్సిపల్ పరిధిలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఆయా వార్డుల పరిధిలో సుమారు పదిహేను వందలకు పైగానే కుక్కలు ఉన్నట్లు అంచనా.
● అయితే కుక్కల నియంత్రణలో భాగంగా మొదట వాటి సంతానోత్పత్తిని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల క్రితం స్థానిక 7వ వార్డులో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
● సెంటర్‌లో 120 కుక్కలను తరలించి శస్త్ర చికిత్స చేశారు. ఇందుకు గాను ఒక్కో కుక్కకు మున్సిపాలిటీ రూ.1,650 వెచ్చిస్తోంది.
● ఇదిలా ఉంటే ఈ కేంద్రం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఇటీవల కోరుట్ల పట్టణ శివారుకు తరలించారు.
● ప్రస్తుతం కుక్కలను అక్కడకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.
‘గాయాలతో కనిపిస్తున్న ఈ చిన్నారులది మెట్‌పల్లి పట్టణం. ఇటీవల తమ ఇళ్ల ముందు ఆడుకుంటున్న సమయంలో వీరిపై కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనల్లో వారి ఒంటిపై పలు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. నొప్పి భరించలేక విలవిల్లాడిపోయారు. ఇలా ఈ ఇద్దరే కాదు.. గడిచిన పది రోజుల్లో పట్టణంలో సుమారు పది మంది వరకు కుక్కల దాడిలో గాయపడడం స్థానికంగా వాటి బెడద ఎంతో ఉందో స్పష్టం చేస్తుంది. వీటిని నియంత్రించాలని చాలారోజులుగా పట్టణవాసులు విజ్ఞప్తి చేస్తున్నా మున్సిపల్ అధికారులు పెడచెవిన పెడుతూ వస్తున్నారు. దీంతో చాలామంది కుక్కల వల్ల గాయాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు.’

వణికిస్తున్న

వణికిస్తున్న