
బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్
జగిత్యాలటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ విషయంలో బీసీలను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. బీసీల ఓట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామంటూ మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్‌కు పంపి హడావుడి చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయడం లేదని, కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చడం లేదంటూ కేంద్రంపై నెపం నెట్టి సీఎం, మంత్రులు ఢిల్లీ వెళ్లి ఆందోళన చేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డినెన్స్ పేరుతో హడావుడి చేసినప్పుడు రిజర్వేషన్ల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటదన్న విషయం కాంగ్రెస్ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యాక బీసీ రిజర్వేషన్ సాధిస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం వారిని మోసగించడమేమన్నారు. బీసీల పట్ల బీఆర్‌ఎస్‌కు చిత్తశుద్ధి ఉందన్నారు. రిజర్వేషన్ అమలుపై ఈనెల 14న కరీంనగర్ కేంద్రంగా నిర్వహించే సదస్సుకు బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికై నా కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, ఓరుగంటి రమణారావు, జవ్వాజి ఆ దిరెడ్డి, హరీశ్, రాజేశ్వర్‌రావు, హరీశ్ పాల్గొన్నారు.