
చెట్లను నరికి.. చదును చేసి
● యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ ● దాదాపు 300ఎకరాలు కబ్జా
కథలాపూర్(వేములవాడ): చెట్లను విరివిగా పెంచి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు ప్రభుత్వం ఓ వైపు ఏటా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుండగా.. పలు గ్రామాల్లో అటవీశాఖకు చెందిన సుమారు 300 ఎకరాల్లో చెట్లను యథేచ్ఛగా నరికివేసి సాగు భూములుగా మార్చుతున్నారు. ఇంతా జరుగుతున్న నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల శివారులో అటవీశాఖ పరిధిలోని భూములు పచ్చని చెట్లతో దర్శనమివ్వాల్సి ఉండగా అవి కనుమరుగవుతున్నాయని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కబ్జాకు గురైన అడవులను అధికారులు రక్షించాలని కోరుతున్నారు.
2,521 హెక్టార్లలో..
కథలాపూర్ మండలంలో 19 గ్రామాలుండగా.. అటవీశాఖ తరుఫున మూడు బీట్‌లుగా విభజించారు. పోతారం బీట్ పరిధిలో పోతారం, ఇప్పపెల్లి, కలిగోట గ్రామల్లో 1,000 హెక్టార్ల భూమి, అంబారిపేట బీట్ పరిధిలో అంబారిపేటలో 600 హెక్టార్లు, చింతకుంట బీట్ పరిధిలోని 11 గ్రామాల్లో 921 హెక్టార్లలో అటవీశాఖ భూములున్నాయి. కాగా అటవీశాఖకు చెందిన భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. యంత్రాలతో రాత్రివేళ చెట్లను తొలగించి భూములు చదును చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో పలువురు అటవీ భూములను చదును చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. ఇలా మండలంలోని మూడు బీట్‌ల పరిధిలో 300 ఎకరాల అటవీభూములను కబ్జా చేసి పంటలు సాగుచేస్తున్నట్లు సమాచారం. గతేడాది కాలం నుంచి పోతారం, చింతకుంట బీట్ పరిధిలోని అటవీశాఖ భూములపై పలువురు కన్నేసి చెట్లను తొలగిస్తుండటంపై ఒకరి నుంచి మరొకరికి సమాచారం వ్యాప్తి చెందడంతో ఈ తతంగం యథేచ్ఛగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు చొరవ చూపి అటవీ భూములకు హద్దులు నిర్ణయించాలని, కబ్జాకు గురైనవాటిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.