
అన్నదానం టోకెన్లు ఎప్పుడో.. ఎక్కడో..!
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదాన ప్రసాదం కొందరికే అందుతోంది. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ ఆవరణలో నిత్యాన్నదాన సత్రం నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో 200 మంది భక్తులకు.. మిగిలిన రోజుల్లో రోజుకు వందిమంది చొప్పున భక్తులకు అన్నదానం అందిస్తున్నారు. అన్నదానం టోకెన్లు ప్రతిరోజు ఉదయం 11గంటలకు జారీ చేస్తుంటారు. ఈ టికెట్ల కోసం కొందరు ఉదయం 9గంటల నుంచే పడిగాపులు కాస్తున్నారు. టోకెన్లు ఎప్పుడిస్తారో..? ఎక్కడిస్తారో..? తెలియక నిరాశతో వెనుదిరుగుతున్నారు. అన్నదానం టోకెన్లు జారీ సమయం తెలిసేలా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతోపాటు, ప్రతి మంగళవారం, శనివారాల్లో కనీసం 300మందికి, మిగిలిన రోజుల్లో 200 మందికి ఉచిత అన్నదానం అందేలా ఆలయ అధికారులు చొరవ చూపాలని భక్తులు కోరుతున్నారు.