
ఆగని అవినీతి
కోరుట్ల: ఈ ఏడాది నాలుగు నెలలుగా జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నెలకొకరు చొప్పున వరుసగా ఏసీబీకి చిక్కుతున్న వైనం కలరవపెడుతోంది. జగిత్యాల మున్సిపాల్టీలో విజిలెన్స్ తనిఖీలు కొనసాగుతున్నాయి. వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై లెక్కలేని అవీనితి ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జిల్లాలో వివిధ శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది పని తీరు పై పరిపాలనపరంగా దృష్టి సారించడం లేదా..? ఒకవేళ తమ దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోవడం లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చర్యలు లేకుంటేనే ఏసీబీకి..?
సాధారణంగా వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తున్నవారు అక్కడి ఉద్యోగులు లంచాలు ఆశిస్తూ వేధిస్తున్న విషయాన్ని మొదటగా పైఅధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పైఅధికారుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం..లంచం కోసం పీడిస్తున్న ఉద్యోగి తన తీరు మార్చుకోని పరిస్థితుల్లోనే బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు తమ పరిధిలోని ఉద్యోగుల తీరుతెన్నులు, పనితీరు, అవినీతి వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ.. నామమాత్రంగా వ్యవహరిస్తున్న ఫలితంగానే కింది స్థాయి సిబ్బంది పట్టపగ్గాలు లేని రీతిలో లంచావతారం ఎత్తుతున్నారు. ఇంకా చెప్పాలంటే కొంత మంది ఉద్యోగులు తమ పైఅధికారులను మచ్చిక చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి మరీ దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన నలుగురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడిన వైనం చూస్తుంటే కింది స్థాయి ఉద్యోగుల పనితీరుపై ఉన్నతాధికారులు ఏ మేర దృష్టి సారిస్తున్నారన్న అంశం తేటతెల్లమవుతోంది.
పర్సంటేజీల దందా..
వరుసగా ఏసీబీ దాడులు కొనసాగుతున్నప్పటీకి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో పర్సంటేజీల దందా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, పోలీసు, పౌరసరఫరాల శాఖలో కొంతమంది ఉద్యోగులు పర్సంటేజీలు, కమీషన్లు తీసుకుంటున్న తీరు బహిరంగ రహస్యం. జిల్లాలో ఐదు మున్సిపాల్టీల్లో ఇటీవల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఆయా బల్దియాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. ఇదే అదనుగా గతంలో పాలకవర్గాల ప్రజాప్రతినిధులకు ఇచ్చే పర్సంటేజీతో కలుపుకొని తమ పర్సంటేజీ పెంచి కమీషన్ ఇవ్వాలని కొంత మంది ఉద్యోగులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖ పనుల్లోనూ ఉద్యోగుల హోదాను బట్టి కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజీల వసూలు యథేచ్ఛగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూభారతి అమల్లోకి వచ్చిన తహసీల్దార్ కార్యాలయాల్లో కిందిస్థాయి ఉద్యోగుల తీరు మారలేదు. రాయికల్ ఇన్‌చార్జి తహసీల్దార్ ఏసీబీకి చిక్కడమే దీనికి నిదర్శనం. ఈ రీతిలో జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులు పర్సంటేజీలు, కమీషన్ల కోసం వేధిస్తూ.. ఏసీబీకి చిక్కుతున్నప్పటికీ ఉన్నతాధికారులు ఆ అవినీతిని అడ్డుకునేందుకు దృష్టి సారించడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీతో పాటు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే అవినీతి చీడకు చెక్ పడే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏసీబీకి పట్టుబడుతున్న అధికారులు జిల్లాలో నెలకొకరు చొప్పున పట్టివేత
కలవరపెడుతున్న వరుస ఘటనలు అధికారులు ఏం చేస్తున్నట్లు..!?
ఏప్రిల్ 11..
జగిత్యాల సబ్ ట్రెజరీ కార్యాలయంలో రఘు అనే ఉద్యోగి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
జూన్ 3న..
రాయికల్ ఇన్‌చార్జి తహసీల్దార్ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు.
ఆగస్టు 6..
డీటీవో భద్రునాయక్ తన వ్యక్తిగత డ్రైవర్‌ను మధ్యవర్తిగా ఉంచి రూ.22 వేలు లంచం తీసుకుంటై ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
జూలై 30..
జిల్లా కేంద్రంలోని
పంచాయతీరాజ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఈ అనిల్ రూ.7 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.