
మీసేవ అర్హత పరీక్ష మరోసారి నిర్వహించాలి
జగిత్యాల: జిల్లాలో ఇటీవల నిర్వహించిన మీసేవ అర్హత పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని కలెక్టరేట్‌లో నిరుద్యోగులు వినతిపత్రం అందించారు. అర్హత పరీక్షలో అవకతవకలు జరిగాయని, నాన్‌లోకల్ అభ్యర్థులు తప్పుడు ధ్రువపత్రాలతో పరీక్షకు హాజరయ్యారని ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ చేపట్టి మరోసారి పరీక్ష నిర్వహించాలని కోరారు.
ఇచ్చిన హామీ అమలు చేయాలని..
● కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన
జగిత్యాలటౌన్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. మధ్యాహ్న భోజన కార్మికులు బుధవారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. రూ.పదివేల వేతనం చెల్లించాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, లేకుంటే సెప్టెంబర్ ఒకటోతేదీ నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా ఇన్‌చార్జి వెన్న మహేశ్ హెచ్చరించారు. ప్రతిరోజు రెండు కూరలు చేసి పెట్టాలని ఒత్తిడి తెస్తున్న అధికారులు.. పెండింగ్ బిల్లులపై స్పందించడం లేదన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరా రు. యునిఫాంతోపాటు ప్రమాదబీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాలన్నారు. కార్మిక సంఘం ప్రతినిధులు మునుగూరి హన్మంతు, వెల్మలపల్లి వెంకటాచారి, పద్మ, సరిత, గంగవ్వ, రుక్మ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

మీసేవ అర్హత పరీక్ష మరోసారి నిర్వహించాలి