
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
● 16 తులాల బంగారు నగలు స్వాధీనం
జగిత్యాలక్రైం:జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అత్తినేని చంద్రమోహన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాయికల్ మండలానికి చెందిన చంద్రమోహన్ అలియాస్ చందు కొన్నేళ్లుగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అతడిపై పీడీయాక్ట్ నమోదై ఉంది. బుధవారం పట్టణ శివారులోని శంకులపల్లి రైతుచౌరస్తా వద్ద పట్టణ సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. మోహన్ అనుమానాస్పదంగా కన్పించాడు. అతడిని విచారించగా గతంలో జిల్లాలో జరిగిన ఏడు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతడి నుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. పట్టణ సీఐ కరుణాకర్, ఎస్సై సుప్రియ, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు.