● ఆటుపోట్ల మధ్య వస్త్రపరిశ్రమ
● మార్పులకు అనుగుణంగా నూతనత్వం
● నేడు జాతీయ చేనేత దినోత్సవం
సిరిసిల్ల: చేనేత, మరనేత(పవర్‌లూమ్)రంగాలు కాలానికి ఎదురీదుతూ.. ఆధునికతను సంతరించుకుంటూ.. సగర్వంగా తలెత్తుకు నిలబడుతోంది. అనేక కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతుంటే.. మార్పులకు అనుగుణంగా చేనేత రంగం సుస్థిరంగా పదిలమైంది. నేతన్నలు మార్పులకు అనుగుణంగా వస్త్రోత్పత్తిలో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. చేనేతరంగం వయోభారంతో మరణశయ్యపై ఉండగా.. పవర్‌లూమ్(మరమగ్గాల) రంగం ఆటుపోట్ల మధ్య ఆత్మగౌరవంతో జీవించేందుకు ఆరాటపడుతోంది. దేశంలో వ్యవసాయరంగం తర్వాత రెండోస్థానం వస్త్రోత్పత్తి రంగానిదే. చేనేత మగ్గాలపై అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి ప్రపంచానికి చేనేత కళావైభవాన్ని చాటిచెప్పిన ఘనత సిరిసిల్ల నేతకార్మికులది. సంక్షోభంలోనూ శ్రమిస్తున్న నేతన్నలపై జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
చేనేత వందేళ్ల చరిత్ర
1905లో పశ్చిమ బెంగాల్ స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ చేనేతరంగంలో ఉద్యమం మొదలైంది. కలకత్తా టౌన్‌హాల్‌లో 1905 ఆగస్టు 7న భారీ సమావేశం నిర్వహించి విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి దేశీయోత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చేనేత రంగానికి గుర్తింపు నిస్తూ 2012 ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జాతీయస్థాయిలో ఉత్తమ నేతకార్మికులకు అవార్డులు అందిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనూ నేతన్నలకు గుర్తింపు నిస్తూ అవార్డులు ఇస్తున్నారు.
సిరిసిల్లలోనే తొలి నేతన్న విగ్రహం
దేశంలోనే తొలి చేనేత కార్మికుడి కాంస్య విగ్రహాన్ని సిరిసిల్లలో నెలకొల్పారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలు ఉండగా, సిరిసిల్లలోనే 28 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 24 వేల మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం, 4 వేల మగ్గాలపై కాటన్ వస్త్రోత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో నిత్యం 25 లక్షల మీటర్ల వస్త్రం తయారవుతుంది. 20వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సిరిసిల్లలో చేనేత మగ్గాలు 175 ఉండగా.. వీటిపై 58 మంది వృద్ధులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే తొలి టెక్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఏర్పాటు చేశారు. సిరిసిల్ల వస్త్రాలు దేశ వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. సిరిసిల్ల అద్దకంలో అగ్రస్థానంగా ఉంది. జాతీయ జెండాలను గతేడాది 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా సరఫరా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ విద్యామిషన్, సర్వశిక్ష అభియాన్, ఎస్సీ, బీస్సీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖలకు అవసరమైన వస్త్రోత్పత్తి ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నారు. ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీని ప్రభుత్వం పక్కన పెట్టి ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లు ఇచ్చింది. మహిళా సంఘాల్లోని సభ్యులకు రెండు జతల చీరలు అందించే లక్ష్యంతో 1.30 కోట్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు సిరిసిల్లకు అందించారు. అపెరల్ పార్క్‌లో టెక్స్‌పోర్ట్, గోకుల్‌దాస్ గార్మెంట్ యూనిట్లలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ.. అమెరికాకు రెడీమేడ్ వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి.
ఇవీ చేస్తే మేలు
ఉత్పత్తి అయిన వస్త్రానికి మార్కెట్ వసతి కల్పించాలి.
మొత్తం వ్యవస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన కార్మికులు ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వపరంగా ఆజమాయిషి ఉండేలా తీర్చిదిద్దాలి.
నేతకార్మికులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి.
పేదరికమే అర్హతగా అంత్యోదయకార్డులు, ఆర్థిక చేకూర్పు, మహిళా సంక్షేమ పథకాల అమలు చేయాలి.
నేతకార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
త్రిఫ్ట్ పథకంలో అందరిని చేర్పించాలి.
కార్మికులకు గుర్తింపుకార్డులు ఇచ్చి ఆరోగ్య సంరక్షణ పథకాలు అందించాలి.
నేటి తరం యువతకు ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి శిక్షణ అందించాలి.
వస్త్రపరిశ్రమలో ఆధునికతపై పరిశోధనలు జరగాలి.
బీమా నేతన్నలకు వరం
నేతన్నలకు రైతుల తరహాలో రూ.5 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించారు. 2021 జూలై 4న సిరిసిల్ల వేదికగా ఈ పథకాన్ని ప్రకటించారు. 18–59 ఏళ్ల మధ్య వయసు గల నేతకార్మికులకు అమలు చేస్తున్నారు. బీమాలో చేరిన నేతన్నలు ఏ కారణంగా మరణించినా బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం ఎల్‌ఐసీ ద్వారా అందుతుంది. నేతకార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీ, త్రిఫ్ట్ పొదుపు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయి.
చేనేత.. ఎదురీత !