
విమానంలో వలసకార్మికుడికి గుండెపోటు
● ముంబయిలో అత్యవసర ల్యాండింగ్ ● సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం ● మృతుడి నివాసం కోరుట్లలో విషాదం
కోరుట్ల: ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న ఓ వలసకార్మికుడికి విమానంలోనే గుండెపోటు వచ్చింది. తోటి ప్రయాణికులు సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కథలాపూర్ మండలం చింతకుంటకు చెందిన శ్రీరాముల శ్రీధర్ (42) ఇరవై ఏళ్లుగా కోరుట్లలో అద్దెకు ఉంటున్నాడు. 15 ఏళ్లుగా గల్ఫ్ వెళ్లివస్తున్నాడు. అతడికి భార్య వీణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటికి వచ్చేందుకు మంగళవారం ఉదయం సౌదీ నుంచి హైదరాబాద్‌కు విమానంలో బయలుదేరాడు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో శ్రీరాములు ఊపిరి ఆడటం లేదని విమాన సిబ్బందికి చెప్పడంతో వారు వెంటనే సీపీఆర్ చేసి ముంబయిలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ముంబయి నుంచి శ్రీధర్ మృతదేహం గురువారం కోరుట్లకు రానుంది. ఆయనకు కోరుట్లలో సొంత ఇల్లు లేకపోవడంతో శ్రీధర్ కుటుంబం ఉండటానికి స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచే శ్రీధర్ అంతిమయాత్ర నిర్వహించనున్నారు. భార్యాపిల్లలను చూసేందుకు ఇంటికి వస్తున్న క్రమంలో శ్రీధర్ విమానంలోనే మృతి చెందడంతో కోరుట్లలో విషాదం నెలకొంది.