అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
● 48 గంటల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు ● రెండు కేసుల్లో మూడున్నర తులాల బంగారం స్వాధీనం
జమ్మికుంట: వృద్ధులకు పింఛన్ ఇప్పిస్తానని మెడలోని రెండు తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లిన అంతర్ జిల్లా దొంగను జమ్మికుంట టౌన్ సీఐ వరంగంటి రవి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్‌జి వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వడ్డెరకాలనీకి చెందిన అల్లెపు కృష్ణ అనే వ్యక్తి వీణవంక మండలం కనపర్తి గ్రామానికి చెందిన అల్లెపురెడ్డి కమలమ్మ, కొమురరెడ్డి అనే వృద్ధ దంపతులకు జమ్మికుంట పట్టణంలో పింఛన్ ఇప్పిస్తానని, ఫొటో తీయాలని, మెడలో బంగారం ఉండొద్దంటూ రెండు తులాల బంగారు పుస్తెల తాడును మంగళవారం ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీఐ రవి ఆధ్వర్యంలో విచారణ చేపట్టి 48 గంటల్లో చోరీ కేసు ఛేదించారు. వృద్ధుల రెండు తులాల బంగారం, హైదరాబాద్‌లో కృష్ణ చోరీ చేసిన మరో ఘటనలో తులంన్నర బంగారం స్వాధీనం చేసుకున్నారు. సీఐ రవి, హెడ్ కానిస్టేబుల్ మోహన్, సదయ్య, కానిస్టేబుల్ అబ్దుల్ ఖదీర్, శ్రీకాంత్‌ను ఏసీపీ అభినందించారు.
పీడీ యాక్ట్..
కృష్ణ గతంలో పీడీ యాక్ట్ కింద 4 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించినా.. చోరీలకు పాల్పడడం మానుకోలేదు. అంతర్ జిల్లా చోరీలకు పాల్పడుతున్న కృష్ణపై రాష్ట్రవ్యాప్తంగా 80 కేసులున్నాయి. జమ్మికుంటలో 3, హుజూరాబాద్‌లో 3, కరీంనగర్‌లో 10 కేసులున్నాయని ఏసీపీ తెలిపారు.


