లైసెన్స్‌ తీసుకోరు.. రెన్యూవల్‌ చేసుకోరు | - | Sakshi
Sakshi News home page

లైసెన్స్‌ తీసుకోరు.. రెన్యూవల్‌ చేసుకోరు

Mar 15 2025 12:24 AM | Updated on Mar 15 2025 12:23 AM

మెట్‌పల్లి(కోరుట్ల): పట్టణాల్లో వ్యాపారాలు నిర్వహించాలంటే మున్సిపాలిటీ నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న దుకాణం నుంచి మొదలుకొని భారీ పరిశ్రమల వరకు తప్పనిసరిగా ఈ లైసెన్స్‌ను కలిగి ఉండాలి. అలాగే ప్రతి సంవత్సరం దానిని రెన్యూవల్‌ చేసుకోవాలి. కానీ స్థానికంగా చాలా మంది లైసెన్స్‌ తీసుకోకుండానే దర్జాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రతీ వ్యాపారి లైసెన్స్‌ తీసుకునేలా చూడాల్సిన మున్సిపల్‌ శానిటేషన్‌ విభాగం సిబ్బంది ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సగం మందికే లైసెన్స్‌లు

● మెట్‌పల్లి పట్టణంలో కమర్షియల్‌ భవనాలు 1,162, మిక్స్‌డ్‌ కమర్షియల్‌ భవనాలు 959 ఉన్నాయి. అలాగే విద్యుత్‌ శాఖ లెక్కల ప్రకారం స్థానికంగా మొత్తం 4,123 కమర్షియల్‌ మీటర్లు ఉన్నాయి.

● కానీ ట్రేడ్‌ లైసెన్స్‌లు ఇప్పటి వరకు కేవలం 1,138 మాత్రమే జారీ చేసినట్లు ఆ విభాగం సిబ్బంది తెలిపారు. అటు కమర్షియల్‌ మీటర్లు, ఇటు కమర్షియల్‌ భవనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ట్రేడ్‌ లైసెన్స్‌లు లేని దుకాణాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఆదాయనికి భారీగా గండి

● ట్రేడ్‌ లైసెన్స్‌ల జారీ కోసం పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఇందులో ఒక్కో జోన్‌కు ఒక్కో రకంగా ఫీజు నిర్దేశించారు. ప్రస్తుతమున్న లైసెన్స్‌ల ద్వారా ఏటా మున్సిపాలిటీకి రూ.20లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలిసింది.

● వాస్తవానికి పూర్తి స్థాయిలో దుకాణాలను గుర్తించి లైసెన్స్‌లు జారీ చేస్తే ఇంతకు రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశముంటుంది. కానీ, సిబ్బంది నిర్లక్ష్యంతో మున్సిపాలిటీకి ఏటా రూ.లక్షల్లో నష్టం జరుగుతోంది.

కొలతల్లో అక్రమాలు

● ట్రేడ్‌ లైసెన్స్‌లను పర్యవేక్షించే సిబ్బంది దుకాణాలకు కొలతలు వేసే విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

● పెద్ద వ్యాపార దుకాణాలకు ఉన్న ప్రకారం కాకుండా తక్కువ కొలతలు చూపి వ్యాపారుల నుంచి సిబ్బంది లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

● ఉన్నతాధికారులు స్పందించి ట్రేడ్‌ లైసెన్స్‌ల ద్వారా సమకూరే ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు అక్రమాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండా పెద్ద సంఖ్యలో వ్యాపారాల నిర్వహణ

పట్టించుకోని అధికారులు

ఏటా మున్సిపాలిటీకి రూ.లక్షల్లో నష్టం

‘ఇది మెట్‌పల్లి ఖాదీ ప్రతిష్టాన్‌కు చెందిన షాపింగ్‌ కాంప్లెక్స్‌. ఇందులో

సుమారు వంద దుకాణాలు ఉన్నాయి. అయితే ఇందులో ఒక్క దానికి కూడా ట్రేడ్‌ లైసెన్స్‌ లేదు. ఈ కాంప్లెక్స్‌ను ఖాదీ యాజమాన్యం మున్సిపల్‌ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మించడం.. వాటికి ఇంటి నంబర్లు లేకపోవడం వంటి కారణాలతో ట్రేడ్‌ లైసెన్స్‌లు జారీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు మున్సిపాలిటీకి రూ.లక్షల్లో నష్టం జరిగింది. ఇలా ఇదొక్కటే కాదు.. పట్టణంలో పెద్ద సంఖ్యలో దుకాణాలు ట్రేడ్‌ లైసెన్స్‌లు లేకుండానే నిర్వహిస్తున్నారు.’

నోటీసులు ఇస్తున్నాం

పట్టణంలో ట్రేడ్‌ లైసెన్స్‌లు తీసుకోని వారితో పాటు లైసెన్స్‌లు ఉండి రెన్యూవల్‌ చేసుకోని వారిని గుర్తించి నోటీసులు ఇస్తున్నాం. ప్రస్తుతం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం. ప్రతీ వ్యాపారి లైసెన్స్‌ తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. కొలతల విషయంలో అక్రమాలు జరగడం లేదు. నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాం.

– రత్నాకర్‌, ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, మెట్‌పల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement