పచ్చ బంగారం.. దిగుబడి భారం
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో పసుపు ప్రధాన పంట. దిగుబడికి తగిన ధర లేక ఇబ్బందులు పడుతు న్న రైతులకు, ఈ ఏడాది తెగుళ్లతో మరింత నష్టం జరిగే అవకాశముంది. ఈసారి కురిసిన అత్యధిక వర్షాలు, మారిన వాతావరణ పరిస్థితులతో పంట కు తెగుళ్లు వచ్చాయి. పెట్టుబడి కూడా వచ్చే అవకా శం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 35వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. మల్లాపూర్, ఇబ్ర హీంపట్నం, మెట్‌పల్లి, కోరుట్ల, కథలాపూర్, మేడిపల్లి, జగిత్యాల రూరల్, గొల్లపల్లి, రాయికల్, సా రంగాపూర్ మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేశారు. పంట విత్తిన నెల పాటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, ఆక్టోబర్‌లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంటచేలో నీరు నిలిచింది. భూమిలో తేమ శాతంపెరిగి, తెగు ళ్లు, పురుగులకు నిలయంగా మారింది. పసుపు పంటకు రసాయన ఎరువులు కాకుండా పశువుల పేడ, కోళ్ల ఎరువు ఎక్కువగా వేస్తుంటారు. నీటినిల్వతో సేంద్రియ ఎరువుల పోషకాలు పసుపు మొక్కకు అందకుండా పోయాయని రైతులు అంటున్నారు.
తీవ్రంగా దుంపకుళ్లు తెగులు
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపు పంట ఆకులు పచ్చగా ఉండి, భూమిలో దుంపకుళ్లు రోగం సోకితే, మరికొన్ని ప్రాంతాల్లో ఆకులు ఎండిపోయి భూమిలో దుంప మురిగిపోవడం జరిగింది. పంటకు నవంబర్ నుంచి జనవరి వరకు కొమ్ములు ఊరే దశ. ఈ దశలోనే దుంపకుళ్లు సోకడంతో ఎకరాల కొద్ది నష్టం జరుగుతోంది. దుంపలో పురుగులు చేరి, గోధుమ రంగు మచ్చలు ఏర్పడి కుళ్లిపోతున్నాయి. దుంపలో పసుపు రంగుకు బదులు మట్టి రంగు ఏర్పడి, పసుపు కాండం వేరు కుళ్లి ఉండి, ఒత్తితే నీరు కారుతోంది. జిల్లాలోనే దాదాపు 15 వేల ఎకరాల్లో దుంపకుళ్లు రోగం సోకినట్లు తెలుస్తోంది. గతేది ఎకరాకు 40 డ్రమ్ములు(25 క్వింటాళ్లు) దిగుబడి వస్తే, ఈ ఏడాది కనీసం 20 డ్రమ్ములు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు.
దెబ్బతీసిన వర్షాలు
వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో పంటచేలు నుంచి నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. వేసిన ఎరువులను మొక్క తీసుకోకపోవడంతో పాటు పురుగులు, తెగుళ్లకు నిలయంగా మారింది. ఎకరాకు కనీసం రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టగా, పంట అమ్మితే అదీ వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు.
పచ్చ బంగారం.. దిగుబడి భారం


