కబ్జా చేసి.. కలిపేసి!
మెట్‌పల్లిరూరల్: చివరి ఆయకట్టుకు నీరందించే ఎస్సారెస్పీ ఉప కాలువలు కనుమరుగవుతున్నా యి. కొన్నేళ్లుగా తూములకు సరిపడా నీరు అందకపోవడంతో ఉపకాలువలు నిరుపయోగంగా ఉన్నా యి. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న కొందరు రైతులు పూడ్చివేసి కబ్జా చేస్తున్నారు. ఉపకాలువల భూమిని వ్యవసాయ భూముల్లో కలిపేసుకుంటున్నారు. పంటలు వేసి సాగుచేస్తున్నారు. మెట్‌పల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో ఎస్సారెస్పీ ఉపకాలువలు కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం వరినాట్లు వేసేందుకు సిద్ధమవుతున్న రైతులు కొందరు కాలువను పూడ్చివేయించి తమ భూముల్లో కలిపేసుకోవడం గమనార్హం.
8 ఉపకాలువలు.. 55వేల ఎకరాల ఆయకట్టు
మెట్‌పల్లి ప్రాంతంలో డి– 30, డి–32,డి–32(ఎ),డి–32(బి),డి–33,డి–34,డి–35,డి–36 ఉపకాలువలు ఉన్నాయి. వీటి కిందట 55 వేల ఎకరాలపై ఆయకట్టు ఉంది. మెట్‌పల్లి, రేగుంట, వెల్లుల, చౌలమద్ది, పెద్దాపూర్, చింతపేట, వేంపేట ప్రాంతాల గుండా ఉప కాలువలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాలువకు ఇరువైపులా భూములను వ్యవసాయ భూముల్లో కలిపేసుకున్నారు. మిగతా చోట్ల కాలువను పూడ్చివేసి భూముల్లో కలుపుకున్నారు. ఎస్సారెస్పీ కాలువల భూములను కలిపేసుకుంటున్న రైతులను చూస్తున్న మిగతా కొందరు సైతం కాలువ భూములను ఆక్రమిస్తున్నారు.
దృష్టి సారించని అధికారులు
ఎస్సారెస్పీకి భూములు ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాలువ భూములను ఆక్రమించినా, పూడ్చివేస్తున్నా అధికారులు దృష్టి సారించకపోవడం వారి పనితీరు విషయంలో నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉపకాలువ పూడ్చివేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. అటువైపు కన్నెత్తి చూడడం లేదని కొందరు ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సాజిద్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.
ఈ స్థలం మెట్‌పల్లి మండలం వెల్లుల శివారులోనిది. ఇక్కడ మొన్నటి వరకు ఎస్సారెస్పీ డీ–32(ఎ) ఉపకాలువ ఉండేది. పూడ్చివేయించిన ఓ రైతు పక్కనే ఉన్న తన వ్యవసా య భూమిలో కలిపేశాడు. కొన్నేళ్లుగా తూ ముకు సరిపడా నీరు విడుదలకాకపోవడంతో ఈ ఉపకాలువలోకి నీరు ప్రవహించడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న చాలా మంది రైతులు కాలువను కబ్జా చేశారు.


