పారిశుధ్యం.. అస్తవ్యస్తం
జగిత్యాల: జిల్లాకేంద్రమైన జగిత్యాలలో లక్షకు పైగా జనాభా ఉంటుంది. నాలుగు జోన్లు ఉన్నాయి. చెత్త సేకరణకు నిత్యం 48 మున్సిపల్ ఆటోలు తిరుగుతుంటాయి. 300లకు పైగా పారిశుధ్య కార్మికులున్నారు. కానీ పట్టణంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడా డ్రెయినేజీలు తీయకపోవడంతో మురికినీరంతా నిలిచి రోడ్లపైకే ప్రవహిస్తోంది. అలాగే డ్రెయినేజీల చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం లేదు. జిల్లాలోని 48 వార్డుల్లో ఏదో ఒకరోజు పారిశుధ్య కార్మికులు డ్రెయినేజీలు తీస్తూ.. పిచ్చిమొక్కలు తొలగిస్తున్నారే తప్ప నిత్యం పనులు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో చుట్టూ ఉన్న ఇళ్ల యజమానులు భరించలేకపోతున్నారు. వారికి నోటీసులు ఇచ్చి చెత్తను తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిన ఉన్నప్పటికీ బల్దియా అధికారులు పట్టించుకోవడం లేదు. పట్టణంలోని 48 వార్డులకు 48 ఆటోలుంటే 20కి పైగా మరమ్మతుల్లో ఉన్నాయి. డంపర్‌బిన్స్ లేవు. ఇటీవలే డోజర్ సైతం చెడిపోయింది. అధికారులు మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫాగింగ్ మచ్చుకు కన్పించడం లేదు. ప్రతిరోజు కాలనీల్లో ఉదయం, సాయంత్రం ఫాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఫాగింగ్ మిషన్లు చెడిపోయినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు స్పందించి పట్టణంలో మెరుగైన పారిశుధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
పట్టణంలోని జాంబాగ్ రోడ్డు వద్ద గల బైపాస్‌రోడ్డు. ఈ కాలువ వెంటే ప్రజలు చెత్త పడేస్తుంటారు. ఈ ప్రాంతంలో ఇంటింటికీ చెత్తవాహనం వెళ్లకపోవడంతో ప్రజలే చెత్తను తీసుకువచ్చి వేస్తున్నారు. ఇక్కడ పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. చెత్తతో రోడ్డు నిండిపోతోంది. సమీపంలోని డంపర్‌బిన్‌ను కొద్దిరోజులకే తొలగించారు. దీంతో ఇక్కడి ప్రజలకు చెత్త కష్టాలు తప్పడం లేదు.
ఇది కొత్తబస్టాండ్‌లోని వాటర్‌ట్యాంక్
ప్రాంతం. ఇక్కడ నిత్యం పారిశుధ్య పనులు చేపట్టాలి. క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలి. అధికారులు పట్టించుకోకపోవడంతో ట్యాంక్ సమీపంలో పూర్తి చెత్తమయంగా మారింది. అధికారులు స్పందించి శుభ్రం చేయించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పారిశుధ్యం.. అస్తవ్యస్తం


