
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
● ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్
జగిత్యాలక్రైం: ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, టపాసులు కాల్చడం, సభలు, సమావేశాలు నిర్వహించడం, విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం ఉదయం వరకు పోలీసులు కౌంటింగ్ అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని, స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన వీఆర్‌కే కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్‌స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశామని వెల్లడించారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరయ్యే అధికారులు నిషేధత వస్తువులైన అగ్గిపెట్టే, లైటర్, ఇంక్‌బాటిల్స్, పేలుడు కారణమయ్యే ఎలాంటి వస్తువులనూ తీసుకురావద్దని సూచించారు. తనిఖీలు చేసే సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎలక్షన్ కమిషన్ ద్వారా జారీ చేయబడిన గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని వివరించారు.