World Deadliest Garden: Garden In England Has 100 Poisonous Plants Can Kill - Sakshi
Sakshi News home page

The Poison Garden: ఆ గార్డెన్‌లో గాలి పీలిస్తే పైకే!

Published Wed, Jul 20 2022 2:53 AM

World Deadliest Garden: Garden In England Has 100 Poisonous Plants Can Kill - Sakshi

ఎవరినైనా పార్క్‌ లేదా గార్డెన్‌కు ఎందుకు వెళ్తారని అడిగితే ఏం చెబుతారు? రకరకాల పూల మొక్కలు, చెట్లతో కూడిన అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని చూస్తూ సేదతీరేందుకు, స్వచ్ఛమైన గాలిని పీల్చేందుకు వెళ్తామని బదులిస్తారు. కానీ ఇంగ్లండ్‌లోని ఆల్న్‌విక్‌లో ఉన్న ఓ గార్డెన్‌కు ఎవరైనా వెళ్లాలనుకుంటే మాత్రం ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే!

ఎందుకంటే ఇది మామూలు గార్డెన్‌ కాదు మరి.. పూలచెట్లు, పరిమళభరిత గులాబీలు కూడా ఉన్న ఈ పార్క్‌లో ఎవరైనా కాస్త గట్టిగా అక్కడి గాలి పీలిస్తే కళ్లు తిరిగి పడిపోవడమో లేదా మరణించే అవకాశం కూడా ఉందట! ఈ మిస్టరీ వెనక కాస్త హిస్టరీ ఉందిలెండి. అదేమిటంటే.. ఈశాన్య ఇంగ్లాండ్‌లోని నార్త్‌అంబర్‌ల్యాండ్‌ కౌంటీ రాజ్యవంశ పాలనాధికారి సతీమణి అయిన జేన్‌ పెర్సీ కొన్నేళ్ల కిందట తమ కోట ఆవరణలోని 14 ఎకరాల తోట సుందరీకరణకు నడుంబిగించింది.

గార్డెన్‌కు ప్రత్యేక ఆకర్షణ తెచ్చేందుకు సాధారణ పూల మొక్కలతోపాటు 100 రకాల విషపూరిత మొక్కలను వివిధ దేశాల నుంచి తెప్పించింది. ఇందులో మాంక్స్‌హుడ్, రోడోడెడ్రాన్స్, వోల్ఫ్స్‌ బేన్‌ వంటి విషపూరిత జాతుల మొక్కలు ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత విషపూరితమైన మొక్కగా గిన్నిస్‌ బుక్‌ గుర్తించిన రిసిన్‌ (వాడుక భాషలో క్యాస్టర్‌ బీన్‌ మొక్కగా పిలుస్తుంటారు) కూడా ఈ గార్డెన్‌లో ఉంది.

దీంతో అవి ఎలా ఉంటాయో చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. అయితే సాధారణంగా పార్కుల్లో ‘పూలను తెంచొద్దు’ అని రాసి ఉండటాన్ని చూసే ఉంటారు. కానీ ఈ ‘పాయిజన్‌ గార్డెన్‌’ దగ్గర మాత్రం ‘ఇక్కడ ఆగొద్దు, పూల వాసన చూడొద్దు’ అని రాసి ఉండటం గమనార్హం! ఎందుకంటే ఇందులోని విషపూరిత మొక్కలు విడుదల చేసే విషవాయువులను పీలిస్తే సొమ్మసిల్లి పడిపోవడం లేదా మరణించడం ఖాయమట!

అందుకే ‘ద పాయిజన్‌ గార్డెన్‌’ వద్ద ఉన్న భారీ గేటుపై పుర్రె, ఎముక గుర్తును ఉంచి మరీ ఈ విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఎవరైనా ఇందులోకి ప్రవేశించాలంటే కచ్చితంగా గైడ్‌ సాయం తీసుకోవాలని చెబుతున్నారు. అయినా కొందరు ఆకతాయితనంతో ఆ మొక్కల ఆకులు, పూల వాసన పీల్చి స్పృహ తప్పుతుంటారని పేర్కొన్నారు. నిర్వాహకుల లెక్కల ప్రకారం ఈ గార్డెన్‌ను ఏటా 6 లక్షల మంది సందర్శిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది వృక్ష శాస్త్రవేత్తలే. ‘వరల్డ్స్‌ డెడ్లీయెస్ట్‌ గార్డెన్‌’ అంటూ ట్విట్టర్‌లో తాజాగా ఓ వ్యక్తి ఈ గార్డెన్‌ గేటు ఫొటో షేర్‌ చేయడంతో వైరల్‌ అవుతోంది.  

Advertisement
Advertisement