అమెరికాలోని పెన్సిల్వేనియాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కేవలం నాలుగు నెలల వయసున్న పసికందును ఓ తల్లి ఒంటరిగా కారులోనే వదిలేసి షాపింగ్‌కు వెళ్లింది. వారింగ్‌టన్ చెందిన టీనా డికార్లా (42) అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏం జరిగిందంటే?
టీనా జనవరి 10న ఈస్టన్ రోడ్డులోని వాల్‌మార్ట్ స్టోర్‌కు వెళ్లింది. అయితే పసిబిడ్డను తనతో పాటు తీసుకెళ్లకుండా కారు ముందు సీట్లోనే వదిలేసింది. దాదాపు 20 నిమిషాలకు పైగా ఆ బిడ్డ కారులో ఒంటరిగా ఉంది. కారులో చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఒక వ్యక్తి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు.
అయితే షాపింగ్ ముగించుకుని వచ్చిన టీనాను పోలీసులు వచ్చే వరకు ఉండాలని సదురు వ్యక్తి కోరాడు. కానీ ఆమె అతడి మాట వినకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు.
ఆరు రోజుల తర్వాత ఆమెను ఇంటి వద్దే అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఆమెకు రూ.83 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఆమెపై పలు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.


