‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అంటే ఏమిటి? నాలుగు రోజుల్లో వేలమంది ఎలా మృతి చెందారు?

When a Dangerous Smog in London take Thousands Lives in a Day - Sakshi

సరిగ్గా 70 ఏళ్ల క్రితం లండన్‌లో ఆ రోజు పగటిపూట హఠాత్తుగా చీకటి కమ్ముకుంది. గాలి కలుషితమై నల్లగా మారి, అంతటా వ్యాపించడంతో వేల మంది ఊపిరాడక మృతి చెందారు. నేటికీ ఈ సంఘటన ఇంగ్లండ్‌నే కాదు యావత్ ప్రపంచాన్ని భయపెడుతుంది. 

ఈ ఘటనను ‘గ్రేట్ స్మోగ్ ఆఫ్ లండన్’ అని పిలుస్తారు.  విపరీతమైన కాలుష్యం కారణంగా నాలుగు రోజుల్లోనే  12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఏర్పడిన పొగమంచు వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ఈ భయంకరమైన ‘చీకటి’ 1952 డిసెంబర్ తొలిరోజుల్లో బ్రిటిష్ రాజధాని లండన్‌లో విధ్వంసం సృష్టించింది. 

ఇళ్లను వెచ్చగా ఉంచేందుకు, పారిశ్రామిక వినియోగానికి బొగ్గును విపరీతంగా ఉపయోగించడం కారణంగా ఈ నల్లని పొగమంచు ఏర్పడింది. ఈ పొగమంచు 1952 డిసెంబర్ 5న మొదలై, తదుపరి ఐదు రోజులు అంటే డిసెంబర్ 9 వరకు కొనసాగింది. లండన్‌వాసులు అప్పటికే దశాబ్దాలుగా పొగమంచుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ ఘటన వారిని షాక్‌కు గురిచేసింది. ఈ పొగమంచు కారణంగా లక్ష మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. 

కాలుష్యం కారణంగా ఇక్కడి ప్రజల నాడీ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చింది. శ్వాసకోశ వ్యాధులు తలెత్తాయి. లండన్‌లో వాయు కాలుష్యం 13వ శతాబ్దం నుండే మొదలైంది. దీనిని గమనించి 1301లో ఎడ్వర్డ్- I లండన్‌లో బొగ్గును కాల్చడాన్ని నిషేధించారు. 16వ శతాబ్దం నాటికి అక్కడి గాలి అత్యంత విషపూరితంగా మారింది. గ్రేట్ స్మోగ్ అనేది బ్రిటీష్ చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా మిగిలిపోతుంది. 1956లో బ్రిటన్‌లో తొలిసారిగా క్లీన్ ఎయిర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి వాతావరణ పరిస్థితుల్లో మెరుగుదల కనిపించింది.
ఇది కూడా చదవండి: ఆ నిచ్చెనంటే ఎందుకు భయం? జెరూసలేంలో 273 ఏళ్లుగా ఏం జరుగుతోంది?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top