
వాషింగ్టన్: మనిషి చేతికి ఆరు వేలిగా స్మార్ట్ ఫోన్ తిష్ట వేస్తే, అందులో అత్యంత ఎక్కువగా వాడుతున్న యాప్‌గా వాట్సాప్ నిలిచింది. అందులో కొత్త ఫీచర్ జోడించడం ద్వారా లాభాల పంట పండించుకోవాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ భావిస్తోంది. వాట్సాప్ వినియోగదారులు తాము వాట్సాప్‌లో స్టేటస్‌గా వాక్యాలు, ఫొటోలు, వీడియోలు, లింక్‌లు పెడితే అవతలి వాళ్లు చూడాలంటే తొలుత వాణిజ్య ప్రకటనలు దర్శనమివ్వనున్నాయి. అన్నిరకాల వ్యాపార సంస్థల నుంచి వచ్చే ఈ అడ్వర్‌టైజ్‌మెంట్‌ల ద్వారా ఆదాయాన్ని పొందాలని మెటా ఆశిస్తోంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ దైనందిన జీవిత విశేషాలను తరచూ వాట్సాప్‌లో స్టేటస్‌లో పెట్టుకోవడం సర్వసాధారణమైంది. తొలుత ఎంపికచేసిన కొద్దిమంది యూజర్లు, టెస్టర్లకు మాత్రమే ఈ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. స్టేటస్ యాడ్స్‌తోపాటు ప్రమోటెడ్ ఛానళ్లను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
ఏమిటీ స్టేటస్ యాడ్స్?
ఇన్‌స్టా గ్రామ్‌లో స్టోరీస్ యాడ్స్ మాదిరే ఇవి కూడా వినియోగదారులు ఏవైనా స్టేటస్ పెడితే వాటి మధ్యలో ఇకపై వాణిజ్య ప్రకటనలు దర్శనమిస్తాయి. మధ్యలో కనిపించేవి కేవలం యాడ్స్ మాత్రమే అని ప్రత్యేకంగా తెలిసేలా వాటికి ‘స్పాన్సర్డ్’ అనే మార్క్‌ను పెడతారు. తద్వారా వాణిజ్య ప్రకటనలకు, వ్యక్తిగత స్టేటస్ అప్‌డేట్స్‌కు మధ్య తేడాను అవతలి బంధువులు, స్నేహితులు సులభంగా తెల్సుకోగల్గుతారు. ఒకవేళ యూజర్లు ఈ యాడ్స్‌ను చూడొద్దనుకుంటే బ్లాక్ చేయొచ్చు. భవిష్యత్‌లో కనిపించకుండా పాప్‌అప్‌ను బ్లాక్ కూడా చేయొచ్చు. స్టేటస్‌తోపాటు కల్సిపోయినంత మాత్రాన యూజర్ల స్టేటస్ డేటా అనేది వ్యాపారసంస్థలకు వెళ్లదు. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని మెటా చెబుతోంది. యాడ్స్ ప్రసారం ద్వారా టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్ భారీ లాభాలు సాధిస్తున్న వేళ వాట్సాప్ సైతం అదే బాటలోకి నెమ్మదిగా వస్తోంది.