ఐరాసలో ట్రంప్‌కు చేదు అనుభవం.. బుర్రున్నోడంటూ జేడీ వాన్స్‌ ట్వీట్‌ | What Trump Got Bad Experience From UN JD Vance Reacts This | Sakshi
Sakshi News home page

ఐరాసలో ట్రంప్‌కు చేదు అనుభవం.. బుర్రున్నోడంటూ జేడీ వాన్స్‌ ట్వీట్‌

Sep 24 2025 8:08 AM | Updated on Sep 24 2025 8:26 AM

What Trump Got Bad Experience From UN JD Vance Reacts This

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిలో చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం సాధారణ అసెంబ్లీని(UNGA) ఉద్దేశించి ఆయన సుదీర్ఘంగా ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా అంతసేపు మాట్లాడకపోవడం గమనార్హం. అయితే.. 

న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టాక అక్కడ ఎస్కలేటర్‌ పని చేయకపోవడంతో డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) కాస్త అసౌకర్యానికి గురయ్యారు. అలాగే.. యూఎస్‌జీఏ ప్రసంగం చేసే సమయంలోనూ అక్కడ టెలిప్రాంప్టర్‌ పని చేయలేదు. దీంతో ఆయన ఇబ్బంది పడతారేమోనని అక్కడి సిబ్బంది ఆందోళన చెందారు. కానీ, ఏమాత్రం తడబడకుండా 79 ఏళ్ల ట్రంప్‌ తన సందేశాన్ని చదువుతూ పోయారు. కాసేపటికి వ్యక్తిగత సిబ్బంది ప్రింటెడ్‌ కాపీని అందించగా.. అందులో సందేశాన్ని అలవోకగా చదువుతూ పోయారు. 

ఆ సమయంలో.. ‘‘ ఇక్కడున్న టెలిప్రాంప్టర్‌(Teleprompter) పని చేయడం లేదు. అయినా ఫర్వాలేదు. అది లేకుండా నేను చదవగలను’’ అని అన్నారు. అయితే.. దీనిని ఉపయోగించి ఇక్కడ మాట్లాడాలనుకుంటున్నవాళ్లకు మాత్రం కాస్త ఇబ్బందే అని ఆయన అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఆపై అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితిపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పలు యుద్ధాలను ఆపేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలో ఆ సంస్థ కనీసం స్పందించలేదని.. ఆ సంస్థవి ఉత్త మాటలేనని, చేతల్లేవని ధ్వజమెత్తారు. ‘ఐరాసకు గొప్ప సామర్థ్యముందని నేను ఎల్లప్పుడూ చెబుతూ ఉంటా. కానీ అది కనీసం దానికి దగ్గరికి చేరుకోవడానికీ ప్రయత్నించదు. ఇప్పటికైనా అది బలమైన పదాలతో లేఖ రాయడానికిగానీ, దానిని పాటించడానికిగానీ ముందుకు రాదు. అది ఉత్త పదాలనే రాస్తుంది. అవి యుద్ధాలను పరిష్కరించలేవు’ అని ట్రంప్‌ విమర్శించారు. చివరాఖరల్లో మ్తారం ఆ సంస్థకు వందకు వంద శాతం మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం కొసమెరుపు.

మరోవైపు.. న్యూయార్క్‌లోని ఐరాస హెడ్‌ ఆఫీస్‌లోని నాణ్యత లేని వసతులపైనా ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాడైపోయిన ఎస్కలేటర్‌, పని చేయని టెలిప్రాంప్టర్‌తో తను చేదు అనుభవం ఎదురైందని అన్నారాయన. అయితే.. ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. మా అధ్యక్షుడికి బుర్ర ఉంది కాబట్టి సరిపోయింది అంటూ ఓ ట్వీట్‌ చేశారాయన. సరదా కోణాన్ని పక్కన పెడితే..టెలిప్రాంప్టర్ లేకపోయినా ఆయన అమెరికా విదేశాంగ విధానంపై స్పష్టంగా, సమంజసంగా ప్రసంగించినట్టు అందరూ గమనించారా? అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మరోవైపు.. 

 

 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UN ప్రధాన కార్యాలయంలో అసౌకర్యానికి గురి కావడం పట్ల రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఇది ఐరాస నిర్వాహకుల నిర్లక్ష్యమని రిపబ్లికన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్‌ ఘటనలపై విచారణ జరిపించాలని ఐరాసను వైట్ హౌస్(White House) కోరింది. అధ్యక్షుడి విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో వైట్‌హౌజ్‌ పేర్కొంది.

 టెలిప్రాంప్టర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైజ్‌. ఇది ప్రసంగాన్ని(చదవాల్సిన స్క్రిప్ట్‌) స్క్రీన్‌పై చూపిస్తుంది. దాన్ని చూసుకుంటూ వక్త (speaker) మాట్లాడగలుగుతాడు. ప్రపంచ దేశాధినేతలు, పొలిటికల్‌ లీడర్లు, న్యూస్ రీడర్లు.. వీటిని ఉపయోగిస్తుంటారు.

ఇదీ చదవండి: భారత్‌-పాక్‌ సహా ఏడు యుద్ధాలు ఆపా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement