యూకేలోని ఉత్తర యార్క్‌షైర్‌లోని స్కార్బరో బీచ్‌లో ఇసుకలో ఇరుక్కుపోయిన ఒక వ్యాన్‌ను కాపాడేందుకు ఓ రేంజ్ రోవర్ యజమాని ప్రయత్నించాడు. అయితే, ఆ ప్రయత్నం ఘోరంగా విఫలమైంది. సుమారు $1,58,000 (దాదాపు రూ.1.49 కోట్లు) విలువైన రేంజ్ రోవర్ కూడా ఇసుకలో ఇరుక్కుపోయింది. సముద్ర అలలు పెరిగాయి.
రేంజ్‌రోవర్‌తో పాటు వ్యాన్ కూడా మునిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అంత విలువైన రేంజ్ రోవర్‌ను సముద్రం వద్ద అటువంటి పనులకు వాడినందుకు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
తీరప్రాంతంలో ఇరుక్కుపోయిన ట్రాన్సిట్ వ్యాన్‌ను బయటకు లాగేందుకు రేంజ్ రోవర్ వాహనం ప్రయత్నిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. మొదట వ్యాన్ చక్రాలను ప్లాస్టిక్ పారతో తవ్వి బయటకు తీయడానికి కొందరు ప్రయత్నించారు. రేంజ్ రోవర్ అక్కడికి చేరుకోగానే పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కానీ ఆ ప్రయత్నం తిరగబడింది.
ఇసుకపై నడిచే ప్రత్యేక విధానం ఉన్నప్పటికీ ఆ విలాసవంతమైన ఎస్‌యూవీ కూడా ఇరుక్కుపోయింది. సాయంత్రానికి సముద్ర అలలు పెరగడంతో రెండు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. వాటిలో పైకప్పులు, ఒక యాంటెన్నా మాత్రమే నీటిమీద కనిపించాయి. స్థానికులు ఇచ్చిన సలహాలను యజమానులు పట్టించుకోకుండా, స్వయంగా వాహనాలను బయటకు తీయడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రత్యక్ష సాక్షి చెప్పిందేమిటంటే?
ప్రత్యక్ష సాక్షి సామీ హెల్‌వెల్ మాట్లాడుతూ.. “కొంతమంది స్థానికులు అక్కడికి వెళ్లి, జెట్ స్కీల సాయంతో ఇసుక నుంచి బయటకు తీయాలని సూచించారు. కానీ వారితో వారు మర్యాదగా మాట్లాడలేదు. తమకు ఏం చేయాలో తెలుసన్న అహంభావం కనపడింది. మొదట జెట్ స్కీలను వ్యాన్‌కు కట్టారు. అది లాగడానికి ఏ మాత్రం ఉపయోగపడలేదు. అది పూర్తిగా అవివేకం. నా మామ కోసం నేను ఆ వీడియో తీశాను. వారు వాహనాలను బయటకు తీయడానికి చేసిన ప్రయత్నాలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో చూసి ఆయనకు నవ్వు వస్తుందని అనుకున్నాను” అని చెప్పారు. తర్వాత అధికారులు అలలు తగ్గిన తర్వాత వాటిని బయటకు తీశారు.


