వాషింగ్టన్: రోజూ వ్యాయామం చేస్తే ఆరోగ్యమంటారు. రోజంతా ఆఫీసు పనితోనే సరిపోతూంటే వ్యాయామానికి తీరుబడి ఎక్కడ అంటారు చాలామంది. అచ్చంగా ఇలాంటి వారి కోసమే ఈ కథనం. స్పెషల్ టైమ్ అని కాకుండా... ఆఫీసు లేదా ఇంట్లోనే గంటకోసారి ఐదు నిమిషాలపాటు అటు ఇటు నడిచినా చాలు.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేంత వ్యాయామం చేసినట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా.. ఈ ఐదు నిమిషాల బ్రేక్ మీ మూడ్‌ను సరిచేయడంతోపాటు నిస్సత్తువను తగ్గిస్తుందని.. అదే సమయంలో మీ పని సామర్థ్యం మాత్రం తగ్గదని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం తెలిపింది.
అమెరికాలోని నేషనల్ పబ్లిక్ రేడియో ‘బాడీ ఎలక్ట్రిక్ చాలెంజ్’పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనంలో సుమారు 19,300 మంది పాల్గొన్నారు. వీరిలో సుమారు 11,484 మంది వారికి ఇష్టం వచ్చిన సమయంలో ఐదు నిమిషాలపాటు వాకింగ్ చేసేవారు. కొందరు అరగంటకు ఒకసారి చేస్తే మరికొందరు 60, 120 నిమిషాల విరామంతో చేసేవాళ్లు. ఇలా 21 రోజులు గడిచిన తరువాత వారి నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ బ్రేక్‌లు వారి శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిలోనూ సానుకూల మార్పు తెచ్చినట్లు తెలిసింది. కాకపోతే అరగంటకు ఒకసారి కాకుండా.. రెండు గంటలకు ఒక బ్రేక్ ఇవ్వడం ఆచరణసాధ్యమైన విషయంగా గుర్తించారు.


