దక్షిణ రష్యాలో ఆర్మీకి చెందిన ఓ హెలికాప్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. యుద్ధ విమానాల విడి భాగాలు తయారు చేసే కంపెనీకి చెందిన సిబ్బందితో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తూ డాగేస్తాన్‌లోని కాస్పియన్ సముద్ర తీరంలో నిర్మాణంలో ఉన్న అతిథి గృహంపై కూలిపోగా.. మంటలు ఎగిసిపడ్డాయి.
దీంతో హెలికాప్టర్‌లోని ఏడుగురు ప్రయాణికుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం.. సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని ప్రాథమిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించి.. వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ హెలికాప్టర్‌లో కిజ్ల్యార్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్‌కు చెందిన సిబ్బంది ఉన్నట్లు రష్యా మంత్రి యారోస్లావ్ గ్లాజోవ్ వెల్లడించారు. సుఖోయ్, మిగ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అవసరమైన గ్రౌండ్ కంట్రోల్, డయాగ్నస్టిక్ సిస్టమ్స్‌ను కిజ్ల్యార్ ఎలక్ట్రో మెకానికల్ ప్లాంట్ తయారుచేస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో హెలికాప్టర్ టెయిల్ విరిగిన తర్వాత పైలట్ దాన్ని నియంత్రించేందుకు చేసిన ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. పైలట్.. అత్యవసర ల్యాండింగ్ కోసం సముద్రం వైపు దాన్ని మళ్లించేందుకు ప్రయత్నించినప్పటికీ, హెలికాప్టర్ నిర్మాణంలో ఉన్న భవనంపై పడి మంటల్లో కాలిపోయింది.

ఈ ఘటనపై రష్యా ఫెడరల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ విచారణ చేపట్టింది.. kA-226 హెలికాప్టర్.. రెండు ఇంజన్లతో పనిచేసే తేలికపాటి హెలికాప్టర్.. రష్యాలో రవాణా, యుటిలిటీ అవసరాల కోసం ఉపయోగిస్తారు. ఇది గరిష్టంగా ఏడుగురు ప్రయాణికులను తీసుకెళ్లగలదు.


