
వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు ప్రతిష్టాత్మక పురస్కారం
కఠిన ఆంక్షలను లెక్కచేయక ప్రజాస్వామ్య పోరాటాలు
ఆమె పోరాటం లక్షలమందికి స్ఫూర్తిగా నిలిచింది: నోబెల్ కమిటీ
ఓస్లో: ఎవరిని వరిస్తుందా అని ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోబెల్ శాంతి బహుమతి 2025 సంవత్సరానికి వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో (57)కు లభించింది. ఓస్లోలో నోబెల్ కమిటీ శుక్రవారం ఈ మేరకు ప్రకటన చేసింది. ‘చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య అగ్నిజ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు’అని మచాడోను నోబెల్ కమిటీ ప్రశంసల్లో ముంచెత్తింది. ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలు ఆపిన తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని ఎంత బలంగా వాదించినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరాశే ఎదురయ్యింది.
నిర్బంధాలను ఎదిరించి నిలిచిన నేత
కమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో పోరాడుతున్నారు. నికొలాస్ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి పోరాటం చేస్తున్నారు. దీంతో ఆమెపై మధురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి వెళ్లిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు.
గత సంవత్సరం వెనెజువెలాలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు మదురోకు పోటీగా ఎన్నికల్లో నిలబడుతున్నట్లు మరియా ప్రకటించారు. కానీ, ఆ దేశ ఎన్నికల సంఘం ఆమె అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. దీంతో ఆమె మరో ప్రతిపక్ష నేత ఎడ్ముండో గోంజాలెజ్‌కు మద్దతు పలికారు. కానీ, ఎన్నికల్లో మదురో 51.95 శాతం ఓట్లు సాధించి విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
మదురో వరుసగా మూడోసారి అధ్యక్షుడ య్యారు. ఆ వెంటనే ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలపై ఉక్కుపాదం మోపారు. దీంతో చాలామంది దేశం విడిచి వెళ్లిపోవటమో, అజ్ఞాతంలోకి వెళ్లటమో జరిగింది. మరియా కూడా ఏడాది కాలంగా అజ్ఞాతంలోనే ఉన్నారు. గోంజాలెజ్ స్పెయిన్‌లో రాజకీయ ఆశ్రయం పొందారు. అయితే, ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. గోంజాలెజ్ 67 శాతం ఓట్లు సాధించి స్పష్టమైన విజయం సాధించారని మరియా ఎన్నికల తర్వాత వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.
ఇంజనీర్ నుంచి రాజకీయ నేతగా
మరియా మచాడో వెనెజువెలా రాజధాని కారకాస్‌లో అక్టోబర్ 7, 1967లో జన్మించారు. ఇండస్ట్రియల్ ఇంజనీర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సంవత్సరమే ఆమె రాజకీయ హక్కులు, ఎన్నికల పర్యవేక్షణ కోసం సుమటే పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాని ద్వారా వెనెజువెలాలో ప్రజాస్వామ్య పోరాటం చేస్తున్నారు. ‘బుల్లెట్ల స్థానంలో బ్యాలెట్‌ను ప్రోత్సహించటమే నా లక్ష్యం’అని గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మచాడో వెనెజువెలా కులీన (ప్రభువర్గం) వర్గానికి చెందినవారు.
వెనెజువెలా మూడో మార్వి్కజ్ ఆఫ టోరో (ఆ దేశంలో ప్రభువులకు ఇచ్చే బిరుదు) సెబాస్టియన్ జోష్ ఆంటోనియో రోడ్రిగేజ్ డెల్ టోరో యే అసానియో వారసురాలు. ఆ దేశ ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు ఎడ్వార్డో బ్లానో ఆమెకు ముత్తాత అవుతారు. ఆమె ఆండ్రెస్ బెల్లో క్యాథలిక్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చది వారు. ఇన్‌స్టిట్యూటో డి ఎస్టుడియోస్ సుపీరియరెస్ డి అడ్మినిస్ట్రాసియోలో మాస్టర్స్ చేశారు. ఆమెకు ముగ్గురు సంతానం.
1992లో ఈటెనా ఫౌండేషన్‌ను స్థాపించారు. అయితే, 2002 నుంచి సుమటే కార్యక్రమాలతో ఆమెకు దేశంలో మంచి పేరు వచ్చింది. 2011 నుంచి 2014 వరకు ఆ దేశ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలిగా కొనసాగారు. ప్రస్తుతం ‘వెంటే వెనెజువెలా’రాజకీయ పార్టీకి సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఆ పార్టీ తరఫున ఆమె 2012లోనే అధ్యక్ష బరిలో దిగారు. కానీ, ప్రైమరీ ఎన్నికల్లోనే ఓడిపోయారు. 2023లో మరోసారి ప్రైమరీ ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. కానీ, ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా జరుగు తున్న ప్రజాస్వామ్య పోరాటాలకు ఆమె నాయకత్వం వహిస్తున్నారు.
ఒక అసాధారణ మహిళ
మరియా మచాడో సేవలను నోబెల్ కమిటీ గొప్పగా ప్రశంసించింది. ‘ఇటీవలి కాలంలో లాటిన్ అమెరికాలో అసాధారణ పౌర సాహసికుల్లో మచాడో ఒకరు’అని కొనియాడింది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గొప్పగా పోరాడుతున్నారని జోర్డాన్ వాట్నీ పేర్కొన్నారు. ఓస్లోలో ఈ అవార్డు ప్రకటించిన సమయంలో వెనెజువెలాలో రాత్రి సమయం కావటంతో ఆమె ఒక గుర్తు తెలియని ప్రాంతంలో నిద్రపోతున్నారు. నోబెల్ కమిటీ సభ్యులు ఆమెకు నేరుగా ఫోన్ చేసి విషయం చెప్పగానే షాక్‌కు గురయ్యారు. ‘దేవుడా.. నాకు మాటలు రావటం లేదు.
ఇది ఒక ఉద్యమం, మొత్తం సమాజం సాధించిన ఫలితం ఇది. నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే. వ్యక్తిగతంగానే ఈ పురస్కారానికి నేను అర్హురాలిని కాదు’అని పేర్కొన్నారు. మచాడోకు నోబెల్ పురస్కారం రావటంపై వెనెజువెలాలోని ఆమె మద్దతుదారులు సంబరాలు చేసుకుంటుంటే, మదురో మద్దతు దారులు నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ‘దేశంలో పరిస్థితిని మెరుగుపర్చటం ఎలాగో నాకు తెలియదు కానీ, నోబెల్ శాంతి పురస్కారానికి ఆమె (మచాడో) మాత్రం సంపూర్ణంగా అర్హురాలు’అని సాండ్రా మార్టినెజ్ అనే 32 ఏళ్ల మహిళ సంతోషం వ్యక్తంచేశారు.