వణికిస్తున్న మంచు తుఫాన్
జనజీవనం అతలాకుతలం
20 కోట్ల మంది ప్రభావితం
18కి పైగా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!
10 వేలకు పైగా విమానాలు రద్దు
నేడు, రేపు మరింత తీవ్రంగా తుఫాన్
డాలస్: అతి భారీ మంచు తుఫాన్ అమెరికాను వణికిస్తోంది. దేశంలో అధిక ప్రాంతాలు భారీ హిమపాతం, వర్షం, అతి శీతల పరిస్థితులతో అతలాకుతలమవుతున్నాయి. ఆరుబయట ఎటు చూసినా అడుగుల లోతున మంచు పేరుకునిపోయి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా ఈ భీకర తుఫాన్‌తో ప్రభావితులయ్యారు. 18 రాష్ట్రాల్లో జనజీవితం స్తంభించిపోయింది. దాంతో ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించారు.
అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో విమాన తదితర రవాణా సేవలు స్తంభించిపోయాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా శని, ఆదివారాల్లో కలిపి ఏకంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులను ముందుజాగ్రత్త చర్యగా రద్దు చేశారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు.
ఫెర్న్‌గా పేర్కొంటున్న ఈ తుఫాన్‌కు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. ‘‘ఈ సీజన్‌లోకెల్లా అతి తీవ్రమైన తుఫాన్ ఇదే. బహుశా ఈ దశాబ్దంలోకెల్లా దారుణమైన తుఫాన్‌గా నిలిచినా ఆశ్చర్యం లేదు’’అని పేర్కొంది. నిత్యావసరాల కోసం జనం ఎగబడటంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అప్రమత్తమైంది.
మైనస్‌లో ఉష్ణోగ్రతలు
నార్త్ డకోటా మొదలుకుని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి ఏకంగా మైనస్ 40 దాకా పడిపోతున్నాయి. దాంతో వాహనాలు కూడా మొరాయిస్తున్నాయి. ఫలితంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. టెక్సాస్, ఓక్లహామా, కాన్సాస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఓక్లహామా నుంచి బోస్టన్ దాకా 1,500 మైళ్ల మేరకు తీవ్రంగా ప్రభావితమవుతోంది.
టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా హిమపాతం వణికిస్తోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ మొదలుకుని న్యూయార్క్ తదితర మహా నగరాలు మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. శనివారం 3,200, ఆదివారం 4,800 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌అవేర్ తొలుత పేర్కొంది. ఒక్క ఆదివారమే 7,600కు పైగా సర్వీసులు రద్దవుతున్నట్టు అనంతరం వెల్లడించింది.
కరెంటు కోతలు
అతి శీతల గాలుల ధాటికి అమెరికావ్యాప్తంగా చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దాంతో విద్యుత్‌సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 95 వేలకు పైగా కరెంటు కోత ఉదంతాలు నమోదయ్యాయి! వీటిలో 37 వేలకు పైగా టెక్సాస్‌లోనే కావడం గమనార్హం. ఈ సమస్య కనీసం కొద్ది రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. టెక్సాస్‌లో ఐదేళ్ల క్రితం ఇలాంటి తుఫాన్ సమయంలో భారీ కరెంటు కోతల వల్ల వందలాది మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు గవర్నర్ గ్రెగ్ అబట్ తెలిపారు.
ఎయిరిండియా సర్వీసులు రద్దు
శని, ఆదివారాల్లో భారత్ నుంచి అమెరికా తూర్పు తీరంలోని న్యూయార్క్, నెవార్క్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైల నుంచి ఆ నగరాలకు ఎయిరిండియా రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడుపుతోంది.


