అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం దాదాపు ఖరారు
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్‌లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు.
అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ.
ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్‌లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించింది. కానీ, ఇరాన్‌తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.
ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్‌తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు.


