అమెరికా వీసాలు.. కొందరి అదృష్టం | US visas are privilege not a right says Marco Rubio | Sakshi
Sakshi News home page

అమెరికా వీసాలు హక్కు కాదు, అదృష్టం

Apr 16 2025 5:29 PM | Updated on Apr 16 2025 5:47 PM

US visas are privilege not a right says Marco Rubio

గౌరవంగా ఉండేవారికే  ప్రవేశం: రూబియో 

వాషింగ్టన్‌: అమెరికా వీసా విధానంపై కఠిన వైఖరిని విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. ‘‘అమెరికా వీసాలు (US Visas) హక్కు కాదు. కొందరికి మాత్రమే లభించే అదృష్టం. మా చట్టాలు, విలువలను గౌరవించే వారికే అమెరికాలో ప్రవేశం ఉంటుంది’’ అని స్పష్టం చేశారు. వలస నిబంధనలను మరింత కఠినతరం చేస్తామన్నారు. అమెరికా వర్సిటీల్లోని పాలస్తీనా (Palestine) అనుకూల విద్యార్థులపై చర్యల నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

వీసాదారులంతా తమ అర్హత ప్రమాణాలను నిరంతరం అందుకుంటూ ఉండాల్సిందేనన్నారు. లేదంటే వాటిని రద్దు చేయాల్సి రావచ్చని హెచ్చరించారు. ‘‘అమెరికాకు ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో చట్టాలు స్పష్టంగా ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారమే ప్రతి వీసా దరఖాస్తునూ పరిశీలిస్తారు. ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థించేవారు, అందుకు ఇతరులను ఒప్పించే వ్యక్తులు సైతం యూఎస్‌ వీసాలకు అనర్హులు’’ అన్నారు.

గతేడాది అమెరికా (America) వర్సిటీల క్యాంపస్‌లలో జరిగిన ఘటనలను మార్కో రూబియో (Marco Rubio) ప్రస్తావించారు. అమెరికాలో 11 లక్షలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. ‘‘నిరసనల సందర్భంగా వారిలో పలువురు క్యాంపస్‌లను మూసేశారు. యూదు విద్యార్థులను వేధించారు. రహదారులను దిగ్బంధించారు. భవనాలనూ ముట్టడించారు’’ అని రూబియో చెప్పుకొచ్చారు. ‘‘ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. వీసా ఉల్లంఘనల విషయంలో విదేశీయులకు రాజ్యాంగ రక్షణ వర్తించదు’’ అన్నారు. 

చ‌ద‌వండి: అమెరికాలో కొత్త టెన్ష‌న్‌.. వారి వీసా ర‌ద్దు   

Advertisement
 
Advertisement
Advertisement