అమెరికాలో తెలంగాణ యువ ఇంజినీర్‌పై హత్య కేసు నమోదు
9 నెలల దర్యాప్తు తర్వాత అరెస్ట్
కస్టడీలో నిందితుడు
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెలంగాణకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన భార్యను హత్య చేశాడనే అభియోగాలపై అరెస్టయ్యాడు. తొమ్మిది నెలలపాటు సాగిన దర్యాప్తు చేసిన అనంతరం పోలీసులు అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. భార్యను గొంతు నులిమి హత్య చేసి, నేరాన్ని దాచిపెట్టేందుకు ఘటనా స్థలంలో ఆధారాలు మార్చినట్లు బెలెవ్యూ పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం, 30 ఏళ్ల అవినాష్ నార్నే భార్య రాజిత సబ్బినేని (27) 2025 అక్టోబర్‌లో అమెరికా వాషింగ్టన్‌లోని వారి అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురయ్యారు.
వివాహమైన ఆరు నెలలకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఘటన జరిగిన రోజు తన భార్య బాత్రూంలో తలుపు వేసుకుని బయటకు రావడం లేదని అవినాష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా రాజిత మృత దేహం కనిపించింది. తొలుత అనుమానాస్పద మృతిగా భావించినా, పోస్టుమార్టంలో గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడంతో మరణించినట్లు తేలింది. దీంతో పోలీసులు హత్యగా నిర్ధారించారు.
డిజిటల్ ఆధారాలతో బయటపడిన నిజం
ఘటన సమయంలో తాను 40 నిమిషాలు బయటకు వెళ్లి వచ్చినట్లు అవినాష్ చెప్పాడు. అయితే అపార్ట్‌మెంట్ స్మార్ట్ లాక్, డోర్ సెక్యూరిటీ డేటాను పరిశీలించిన పోలీసులు, అతడు బయటకు వెళ్లిన సమయంలో మరెవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని గుర్తించారు. దీంతో ఇతరులు హత్య చేసి ఉండే అవకాశాన్ని పోలీసులు కొట్టిపారేశారు. దర్యాప్తులో అవినాష్ కు భారత్‌లో మరో మహిళతో రహస్య ప్రేమ సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పెళ్లికి ముందు ప్రారంభమైన ఆ సంబంధం, పెళ్లి తర్వాత కూడా కొనసాగినట్లు చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఆ మహిళ వీరి వివాహానికి కూడా హాజరైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.
కస్టడీలో అవినాష్
హత్య జరిగిన మరుసటి రోజే రాజిత మృతదేహం ఫొటోను అవినాష్ తన ప్రియురాలికి పంపినట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఆ విషయాన్ని అవినాష్ అంగీకరించాడు. మరణానికి ముందు కొన్ని వారాలుగా అవినాష్, రాజిత మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను పోలీసులు విశ్లేషించారు. అవినాష్ తయారు చేసిన పానీయాలకు చేదు రుచి వస్తోందని రాజిత పలుమార్లు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య జరిగిన రోజు కూడా భర్త చేసిన స్మూతీ ‘మందులా, దగ్గు సిరప్‌లా ఉంది’అని ఆమె చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. అవినాష్‌ను అరెస్టు చేశాక జూలై 1న స్థానిక కోర్టులో అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. బెయిల్ కావాలంటే అతడు కోర్టుకు సుమారు రూ.48 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.


