
వాషింగ్టన్: దేశ వ్యతిరేక భావజాలం నింపుకున్న వాళ్లకు అమెరికాలో నిలువనీడ లేదని ఇప్పటికే చాటిన ట్రంప్ సర్కార్ పలు విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాల రద్దు పర్వాన్ని కొనసాగిస్తోంది. శాస్త్రసాంకేతిక పరిశోధనా విద్యలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) విశ్వవిద్యాలయం పైనా ఈ వీసాల రద్దు ప్రభావం పడింది.
ఇప్పటికే పలు వర్సిటీల్లో విద్యార్థులతోపాటు పరిశోధకులు, బోధనా, బోధనేతర సిబ్బందిపైనా వీసాల రద్దు వేటువేసిన రిపబ్లికన్ ప్రభుత్వం కనీసం ఎందుకు వీసా రద్దు చేస్తున్నారో చెప్పకపోవడం దారుణమని ఎంఐటీ వర్సిటీ పేర్కొంది. తమ వర్సిటీలో 9 మంది విదేశీ విద్యార్థుల వీసాలను కారణం చూపకుండానే రద్దుచేశామని వర్సిటీ తాజాగా వెల్లడించింది. అమెరికాలో సీబీఎస్ మీడియాసంస్థ సమాచారం మేరకు ఇప్పటిదాకా అక్కడి 88 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో దాదాపు 530 మంది విద్యార్థులు, సిబ్బంది, పరిశోధకుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆకస్మికంగా రద్దుచేసింది. తమ వర్సిటీలో విదేశీ విద్యార్థుల వీసాల రద్దుపై ఎంఐటీ వర్సిటీ అధ్యక్షురాలు సలీ కార్న్‌బ్లూత్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
వర్సిటీ వర్గాలకు ఈ మేరకు సోమవారం ఆమె ఒక లేఖ రాశారు. ‘‘ఏప్రిల్ 4వ తేదీ తర్వాత హఠాత్తుగా విద్యార్థుల చదువులను కాలరాస్తూ తీసుకున్న ఈ విధానాలు ఏమాత్రం ఆమోదనీయం కాదు. కనీసం ముందస్తు సమాచారం ఇవ్వలేదు. వీసాల రద్దుకు కారణం చెప్ప లేదు. అత్యంత ప్రతిభావంతులైన విదేశీ విద్యార్థులను ఆకర్షించగల వర్సిటీ సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు దెబ్బతీస్తాయి. వర్సిటీ కార్యకలాపాలూ కుంటుపడతాయి. అప్పుడు అంతర్జాతీయంగా వర్సిటీల్లో శాస్త్రసాంకేతిక పరిశోధనలకు సంబంధించి మా వర్సిటీలో ప్రపంచ అగ్రగామిగా కొనసాగడం కష్టసాధ్యమవుతుంది. నూతన పరిశోధనలు, ఆవిష్కరణలతో దేశాన్ని మరింత సుసంపన్నం చేసే క్రతువు కుంటువుడుతుంది’’ అని ఆమె అన్నారు.
పరిశోధనా వ్యయాలకు పరిమితిపైనా వర్సిటీల ఆగ్రహం
అధునాతన అధ్యయనాలకు సంబంధించిన పరోక్ష పరిశోధనా వ్యయాలను పరిమితం చేసుకోవాలని ప్రభుత్వ ఇంధన శాఖ ప్రకటించడంపై వర్సిటీలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. పరోక్ష పరిశోధనా ఖర్చులు ఎంత పెరిగినాసరే ప్రభుత్వం మాత్రం 15 శాతం మాత్రమే రీయింబర్స్ చేస్తుందని పేర్కొనడాన్ని వర్సిటీలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. విద్యాసంస్థలకు నిధులు తగ్గిస్తే ఆయా విభాగాల సిబ్బందికి జీతభత్యాల చెల్లింపు దాదాపు ఆగిపోతుందని వర్సిటీలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ(డీఓఈ)పై బోస్టన్ ఫెడరల్ కోర్టులో ప్రిన్స్‌టన్, కాల్‌టెక్, ఇల్లినాయీ, ఎంఐటీ వర్సిటీలు కోర్టులో దావా వేశాయి.