
80 శాతం తగ్గిన మన విద్యార్థులు
యూరప్ దేశాలవైపు వారి చూపు
ఏడాదిలోనే పరిస్థితులు తారుమారు
ముదురు పాకాన పడుతున్న అమెరికా వీసా సంక్షోభం భారతీయ విద్యార్థుల పాలిట పిడుగుపాటుగా మారుతోంది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచీ విద్యార్థి వీసాలపై నానారకాల ఆంక్షలు విధిస్తుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి అన్న చందంగా తయారవుతోంది. దాంతో పై చదువుల నిమిత్తం అగ్ర రాజ్యానికి వెళ్లే మనవాళ్ల సంఖ్యలో ఈ ఏడాది ఏకంగా 70 నుంచి 80 శాతం తగ్గుదల నమోదైందని హైదరాబాద్‌కు చెందిన పలు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు ఆందోళన వెలిబుచ్చారు.
వీసా అపాయింట్‌మెంట్లను ఉన్నట్టుండి ఫ్రీజ్ చేయడం, వీసా దరఖాస్తుల తిరస్కరణల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం వంటివి కూడా ఇందుకు కారణంగా నిలుస్తున్నట్టు వారు వివరించారు. ‘‘మామూలుగానైతే ఏటా ఈ సమయానికల్లా విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, అమెరికా వెళ్లే ఏర్పాట్లలో తలమునకలుగా ఉంటారు. ఈసారి మాత్రం మేమింకా వీసా స్లాట్లు అందుబాటులోకి వచ్చాయా అని రోజూ ఎంబసీ పోర్టల్‌ను చెక్ చేసుకునే దశలోనే ఉన్నాం! ఇంత దారుణ గత కొన్నేళ్లలో ఎన్నడూ లేదు’’ అంటూ వాపోయారు.
ఇది చాలదన్నట్టు ఈసారి వీసా స్లాట్లను అమెరికా ఎంబసీలు దశలవారీగా విడుదల చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కొత్త నిబంధనలు తెచ్చేస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక నిర్ణయాలు మొత్తం వీసా ప్రక్రియపై విద్యార్థుల్లో టెన్షన్ పెంచేస్తున్నాయి. అంతేకాదు. ఎలాగోలా వీసా స్లాట్లు బుక్కయినా, స్లాట్ దొరికిందంటూ విద్యార్థులకు కన్ఫర్మేషన్ రావడం లేదు.
కొత్తగా అప్‌డేట్ చేసిన స్లాట్ సిస్టంను ఎంబసీలు ప్రయోగాత్మకంగా పరిశీలిస్తుండటమే ఇందుకు కారణం కావచ్చని కన్సల్టెంట్లు అంటున్నారు. కానీ ఈ పరిణామం విద్యార్థులను తీవ్ర మానసిక ఒత్తిడికి లోను చేస్తోంది. ‘‘మరికొద్ది రోజుల్లో గనక వీసా స్లాట్లను విడుదల చేయకపోతే వేలాది మంది భారత విద్యార్థుల అమెరికా చదువుల కల కల్లగా మిగిలిపోనుంది. వాళ్లు తీవ్ర ఆందోళనతో రోజూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు’’ అని ఓ కన్సల్టెంటు ఆవేదన వెలిబుచ్చారు.
హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ మాత్రం వీసా స్లాట్ల ప్రక్రియ పునఃప్రారంభమైందని, అపాయింట్‌మెంట్ల కోసం విద్యార్థులు తరచూ వెబ్‌సైట్లో చూస్తుండాలని సూచించారు. గతేడాది రికార్డు స్థాయిలో ఏకంగా 3.3 లక్షల మందికి పైగా భారత విద్యార్థులు పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. ఈ విషయంలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానంలో నిలిచింది కూడా! కానీ ట్రంప్ రాకతో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. 2024 జనవరి నాటికి 11.6 లక్షలకు పైగా భారత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. యూరప్ దేశాలకు వెళ్తున్న మన విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.
ఇతర దేశాలే ముద్దు
అమెరికా వీసా కోసం అష్టకష్టాలు పడేకంటే ఇతర దేశాలను చూసుకోవడమే మేలని భారత విద్యార్థుల్లో అత్యధికులు భావిస్తున్నారు. ‘‘అమెరికా కలలను నిజం చేసుకునే ప్రయత్నంలో ఇప్పటికే ఏడాది వృథా చేసుకున్నా. ఇంకా దానిమీదే ఆశలు పెట్టుకుని మరో ఏడాది కూడా కోల్పోవడానికి సిద్ధంగా లేను. నాలాంటి ఎంతోమంది విద్యార్థుల అమెరికా కలలకు నా ఉద్దేశంలోనైతే ముగింపు కార్డు పడ్డట్టే’’ అని 23 ఏళ్ల ఓ ఆశావహ విద్యార్థి చెప్పుకొచ్చాడు. ఇప్పుడతను ఆటోమోటివ్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసేందుకు జర్మనీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు.
214(బి)తోనే సమస్య!
గత మార్చిలోనే వీసా స్లాట్లు బుక్ చేసుకుని ఎట్టకేలకు ఇంటర్వ్యూ దాకా వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికులకు ఎంబసీ నుంచి మొండిచెయ్యే ఎదురవుతోంది! ఈ పరిణామంపై కన్సల్టెంట్లే విస్తుపోతున్నారు. మంచి అకడమిక్, సోషల్ మీడియా రికార్డు తదితరాలుండి, గతేడాది దాకా అనాయాసంగా వీసాలు లభించిన ప్రొఫైళ్లను ఈసారి నిర్ద్వంద్వంగా తిరస్కరించేస్తున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్‌లోని 214(బి) సెక్షనే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. చదువు పూర్తయ్యాక మాతృదేశానికి కచ్చితంగా తిరిగి వెళ్తామన్న నమ్మకాన్ని ఎంబసీ అధికారులకు మనవాళ్లు కల్పించలేకపోతున్నారు. ‘‘ఈ నిబంధనలు కొత్తవేమీ కాదు. ఏళ్లుగా ఉన్నవే. కానీ వాటిని ఈ ఏడాదే తొలిసారి అమలు చేస్తున్నారు’’ అని డాలస్‌లో ఇమిగ్రేషన్ కన్సల్టింగ్ సంస్థ నడుపుతున్న రవి లోతుమల్ల వివరించారు.
– సాక్షి, నేషనల్ డెస్క్