వెరవని వ్యక్తిత్వం  | Sakshi Special Story About Nepal former Chief Justice Sushila Karki biography | Sakshi
Sakshi News home page

వెరవని వ్యక్తిత్వం 

Sep 12 2025 12:35 AM | Updated on Sep 12 2025 12:35 AM

Sakshi Special Story About Nepal former Chief Justice Sushila Karki biography

సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్‌లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్‌ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్‌ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం.  ఆమె రచయిత కూడా. వివరాలు...

‘ఇండియా– నేపాల్‌ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.

73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్‌లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్‌లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్‌ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.

‘నేను బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్‌ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్‌ టెర్రస్‌ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్‌నగర్‌ నుంచి భారత్‌ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్‌ మార్కెట్‌కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.

ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్‌ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్‌లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.

టీచర్‌గా మొదలై
సుశీలా కర్కి నేపాల్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్‌ 7, 1952న నేపాల్‌లోని శంకర్‌పూర్‌కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్‌నగర్‌లోని మహేంద్ర మొరాంగ్‌ క్యాంపస్‌ నుండి  బీఏ డిగ్రీ చేసి మన బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్‌ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్‌ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 

1979లో కార్కి బిరాట్‌నగర్‌లో  లాయర్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 1985లో ధరణ్‌లోని మహేంద్ర మల్టిపుల్‌ క్యాంపస్‌లో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేశారు. 2007లో సీనియర్‌ అడ్వకేట్‌గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్‌–హాక్‌ జస్టిస్‌గా నియమితులయ్యారు. నవంబర్‌ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్‌ నుండి 2016 జూలై వరకు నేపాల్‌ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్‌ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.

రచయితగా...
కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్‌లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్‌లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్‌’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.

సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్‌లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.

గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement