
జపాన్ పర్యటనలో అక్కడి ప్రఖ్యాత షోరిన్‌జాన్ దారూమేజీ ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా అందుకున్న దారూమా ప్రతిమ అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. చివరికి ఇంటర్నెట్లో కూడా అదే ట్రెండింగ్‌గా మారింది. జపాన్ చరిత్ర, సంస్కృతులతో దారూమాది విడదీయలేని బంధం! జపనీస్ భాషలో దారూమ అంటే బోధిధర్మ అని అర్థం. ఇక జీ అంటే ఆలయం. బోధిధర్ముడు జెన్ బౌద్ధ స్థాపకుడు. రాజధాని టోక్యోకు ఉత్తరాన టకసాకిలో ఉన్న షోరిన్‌జాన్ దారూమేజీ ఆలయం శతాబ్దాలుగా భక్తులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ వస్తోంది.
ప్రస్తుత రూపంలోని దారూమా ప్రతిమను రూపొందించింది ఆలయపు తొమ్మిదో పీఠాధిపతి అయిన టొగకు. కొంతకాలంలోనే దారూ మా జపనీయుల ఇంటింటి బొమ్మగా మారి పోయింది. నేటికీ ఏటా దారుమా ప్రతిమోత్సవాన్ని షోరిన్‌జా న్‌లో ఘనంగా జరుపుతారు. అలాంటి ప్రతిమను మోదీకి బహూ కరించడం ద్వారా భారత్‌కు జపాన్ శుభాకాంక్షలతో పాటు ఆ ధ్యాత్మిక ఆశీస్సులు కూడా అందించిందని భావిస్తు న్నారు. జపాన్‌లో మామూలు కుటుంబాలతో పాటు రాజకీయ నాయకులు మొదలుకుని వ్యాపారవేత్తల దాకా ఆశలకు, ప్రగతికి ప్రతీకగా ఇళ్లు, కార్యాల యాల్లో దారూమా ప్రతిమను ఉంచుకోవడం పరిపాటి.
బోధిధర్ముడు మనవాడే!
జెన్ బౌద్ధ స్థాపకుడైన బోధిధర్ముడు భారతీ యుడేనని, అందునా దాక్షిణాత్యుడని, క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందినవాడని చెబుతారు. తమిళ నాడులోని పల్లవ రాజు మూడో కుమారుడైన బోధి« దర్మ సన్యాసం స్వీకరించి జెన్ బౌద్ధాన్ని చైనాకు తీసుకెళ్లాడు. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆయన సాటిలేని మేటి. ఆ పోరాట కళను చైనాకు పరిచయం చేసింది కూడా బోధిధర్ముడే. అందుకే చైనీయులు ఆయనను దామో పేరిట దైవంతో సమానంగా కొలుచు కున్నారు. మూలికా వైద్యంలోనూ బోధిధర్ముడు సిద్ధుడు. ఆ విద్యను చైనీయులకు ప్రసాదించింది కూడా ఆయనేనని మనవాళ్లు నమ్ముతారు. ఆ సిద్ధవైద్య కళ శాశ్వతంగా తమకే సొంతం కావాలనే దురాశతో చివరికి దారుమాను విషమిచ్చి అంతం చేశారంటారు. ఈ ఇతివృత్తంతో సూర్య హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా ఘనవిజయం సాధించింది.
ఎటు తిప్పినా పైకే!
చూసేందుకు చిన్నదే అయినా, దారూమా ప్రతిమ తాలూకు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు...
→ తెరుచుకుని ఉండే కన్ను, తిరుగులేని బ్యాలెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు.
→ ఇది గుండ్రంగా, లోపలంతా బోలుగా, కళ్లు చెదిరే రంగులతో కూడి ఉంటుంది.
→ భారీదనం కారణంగా దారూమాను ఎటువైపు పడేలా తట్టినా వెంటనే పైకి లేస్తుంటుంది.
→ ఏడుసార్లు కింద పడ్డా, ఎనిమిదోసారి కూడా పట్టు వీడకుండా పైకి లేవాల్సిందే’నన్న ప్రఖ్యాత జపనీస్ సామెతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.
→ లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి, అహరహం శ్రమించి కలలను నిజం చేసుకోవడానికి దారూమా ప్రతిమను చిహ్నంగా భావిస్తారు.
– సాక్షి, నేషనల్ డెస్క్