
కాలపరిమితి విధించాలని అమెరికా యోచన
కొత్త వీసా నిబంధనలు ప్రతిపాదించిన ట్రంప్ ప్రభుత్వం
భద్రతాపరమైన ముప్పు తలెత్తుతుందన్న అగ్రరాజ్యం.. నిబంధనలపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు
వాషింగ్టన్: అమెరికాలో వీసాల గడువును పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దుర్వినియోగాన్ని తగ్గించడానికి, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడానికంటూ బుధవారం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–వీసాలు, కల్చరల్ ఎక్ఛ్సేంజ్ కోసం ఇచ్చే జే–వీసాలు, విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే ఐ–వీసాలపై కాలపరిమితి విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థి వీసాలపై ఎలాంటి కాలపరిమితి లేదు.
వాళ్లు చదివే కోర్సు ఎన్ని సంవత్సరాలున్నా అంతకాలం వారు ఆ దేశంలో ఉండే అవకాశం ఉంది. అయితే, కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థి, ఎక్ఛ్సేంజ్ వీసాలకు నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఆ గడువు ముగిశాక పొడిగింపు కోసం దర ఖాస్తు చేసుకోవాలి. ఇక జర్నలిస్టులకు 240 రోజు లు మాత్రమే అనుమతిస్తారు. ఇక చైనీయులకైతే కేవలం 90 రోజుల వీసాకు మాత్రమే అనుమతిస్తారు.
గత ఏడాది 16 లక్షల మంది విదేశీ విద్యార్థులు
2024లో ఎఫ్–వీసాలపై దాదాపు 16 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా వచ్చారు. అలాగే, దాదాపు 3,55,000 మంది కల్చరల్ ఎక్ఛ్సేంజ్ సందర్శకులు, 13వేల మంది జర్నలిస్టులు అమెరికాకు వచ్చారు. ‘విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లు అమెరికాలో నిరవధికంగా ఉండటానికి చాలాకాలంగా అనుమతి ఉంది. దీనివల్ల భద్రతా ప్రమాదాలు తలెత్తుతున్నాయి.
పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథాగా ఖర్చవుతోంది. అమెరికా పౌరులకు ఇది నష్టాన్ని కలిగిస్తోంది. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధనలు వీసా హోల్డర్లు అమెరికాలో ఉండే సమయాన్ని పరిమితం చేస్తాయి. దుర్వినియోగం ఆగిపోతుంది. విదేశీ విద్యార్థులను పర్యవేక్షించడానికి ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు ఉంటుంది.
అప్పట్లో పెద్దఎత్తున వ్యతిరేకత
డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలం 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 4,300కి పైగా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ విద్యావేత్తల సమూహమైన ఎన్‌ఏఎఫ్‌ఎస్‌ఏ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. దానిని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే.. బైడెన్ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై అణచివేత తీవ్రం చేసిన విషయం తెలిసిందే. ఆ చర్యల్లో భాగంగానే ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థి వీసాలు, గ్రీన్ కార్డులు రద్దయ్యాయి. లక్షలాది మంది వలసదారుల చట్టపరమైన హోదా కోల్పోయారు.