Kamala Harris: ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోండి

US Vice President Kamala Harris Suo Motu Refers To Pakistan Role In Terrorism - Sakshi

పాక్‌కు కమలా హ్యారిస్‌ హితవు

మోదీతో భేటీలో పాక్‌ గురించి ప్రస్తావించిన కమల  

వాషింగ్టన్‌: పాకిస్తాన్‌లో ఎన్నో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని, వాటన్నింటిపైనా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ హితవు పలికారు. అప్పుడే  అమెరికా, భారత్‌లపై ఉగ్రవాదం నీడ పడకుండా భద్రంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా గురువారం రాత్రి కమలా హ్యారిస్‌తో భేటీ అయినప్పుడు ఉగ్రవాదం విసురుతున్న సవాళ్ల గురించి మాట్లాడుతూ కమల తనంతట తానుగా  పాక్‌ ప్రస్తావన తెచ్చారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీమాంతర ఉగ్రవాదం గురించి మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌ ఉగ్రవాదానికి బాధిత దేశంగా ఎలా మారిందో వాస్తవాలన్నీ విప్పి చెప్పినప్పుడు కమలా హ్యారిస్‌ ప్రధాని మాటల్ని సమర్థించారు. అంతకుముందు ప్రధానితో కలిసి సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్న కమల  ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, భారత్‌లు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుకోవాలన్నారు. ఇరుదేశాల ప్రజల ప్రయోజనాల కోసం రెండు దేశాలు ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచే  చర్యలు చేపట్టాలన్నారు. 

ఇండో– పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛ నెలకొనాలి  
ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అందరినీ కలుపుకొని పోతూ స్వేచ్ఛాయుత పరిస్థితులు నెలకొనేలా కృషి చేయడానికి కట్టుబడి ఉండాలని భారత్, జపాన్‌ పునరుద్ఘాటించాయి. క్వాడ్‌ సదస్సుకి ముందు భారత ప్రధాని మోదీ, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగాతో ముఖాముఖి చర్చలు జరిపారు. అఫ్గానిస్తాన్‌ సహా ప్రపంచదేశాల్లో నెలకొన్న పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.  రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్టుగా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top