కమలా హ్యారిస్‌కు ప్రధాని మోదీ బహుమతులు.. వాటి ప్రత్యేకత ఇదే!

PM Modi Gave These Unique Gifts to Kamala Harris And Quad Leaders - Sakshi

వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో వైట్‌ హౌజ్‌లో భేటీ అయ్యారు. అనంతరం అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాలతో కూడిన క్వాడ్‌ సదస్సులో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రత్యేక బహుమతులు అందించారు. ఆమెతోపాటు అస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులకు సైతం ప్రత్యేక బహుమతులు అందజేశారు.
చదవండి: భారత్‌ మాకు కీలక భాగస్వామి

ప్రధాని మోదీ గులాబీ మీనాకారీ చెస్ సెట్‌ను కమలా హ్యారిస్‌కు బహుకరించారు. ఈ ప్రత్యేక చదరంగం సెట్‌లోని ప్రతి భాగం అద్భుతంగా హస్తకళా నైపుణ్యంతో తయారు చేశారు. దీనిలోని ప్రకాశవంతమైన రంగులు కాశీ విశిష్టతను తెలియజేస్తాయి. గులాబీ మీనాకారి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన కాశీకి సంబంధించినది. అంతేగాక వారణాసి నియోజకవర్గం నుంచే మోదీ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
చదవండి: ఇది మా గగన విహారం మీరు ఎగరడానికి వీల్లేదు!

దీనితోపాటు కమలా హ్యారీస్ తాత పీవీ గోపాలన్ హస్తకళకు సంబంధించిన పాత చెక్క జ్ఞాపికను ప్రధాని ఆమెకు ప్రత్యేక బహుమతిగా ఇచ్చారు. పీవీ గోపాలన్ గౌరవప్రదమైన సీనియర్ ప్రభుత్వాధికారి. ఆయన వివిధ పదవులను నిర్వహించారు. ఆయనకు సంబంధించిన నోటిఫికేషన్ల కాపీని కమల హ్యరిస్‌కు మోదీ ఇచ్చారు.

అదే విధంగా అస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు వెండి గులాబీ మీనకారీ షిప్‌ను బహుమతిగా ప్రధాని మోడీ అందజేశారు. ఇది ప్రత్యేకంగా చేతితో తయారు చేసింది. ఈ ఓడ కాశీ చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే జపాన్ ప్రధాని యోషిహిడే సుగాకు గంధపు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు. భారత్, జపాన్‌ మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో బౌద్ధమతం కీలక పాత్ర పోషించింది. గతంలో జపాన్‌లో పర్యటించినప్పుడు, మోదీ అక్కడ ఉన్న పలు బౌద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు.

కాగా కోవిడ్‌–19 తరువాత ప్రధాని విదేశీ పర్యటన చేయడం ఇదే తొలిసారి. ప్రధాని పర్యటన రేపటితో(శుక్రవారం) ముగియనుంది. 25న (శనివారం) ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సెప్టెంబర్‌ 26 (ఆదివారం ) భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top