హెచ్‌ 1బీ వీసా : ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం | US proposes to H-1B visas scrap computerised lottery system  | Sakshi
Sakshi News home page

హెచ్ ‌1బీ వీసా : ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం

Oct 29 2020 1:45 PM | Updated on Oct 29 2020 2:15 PM

 US proposes to H-1B visas scrap computerised lottery system  - Sakshi

హెచ్‌ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్దతికి గుడ్ చెబుతూ డొనాల్డ్ ట్రంప్‌ సర్కార్‌  మరో కీలక  ప్రతిపాదన చేసింది.

వాషింగ్టన్‌: వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు  జరగనున్న నేపథ్యంలో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సర్కార్‌  భారతీయ ఐటి నిపుణులకు మరోసారి షాక్ ఇచ్చింది.  హెచ్‌ 1బీ వీసాల జారీలో కంప్యూటరైజ్డ్‌ లాటరీ పద్దతికి గుడ్ బై చెబుతూ మరో కీలక ప్రతిపాదన చేసింది. దీనిస్థానంలో వేతన స్థాయి ఆధారిత వీసాలు జారీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఫెడరల్‌ రిజిస్టర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందన తెలియజేయవచ్చుని అమెరికన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ(డిహెచ్‌ఎస్‌) తెలిపింది.  

ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యత అంటూ ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న ట్రంప్‌ సర్కార్‌  తాజాగా లాటరీ పద్దతిన వీసాలు కేటాయించే పద్దతికి కూడా స్వస్తి చెప్పాలని నిర్ణయించింది. లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై గరిష్ఠ వేతన స్థాయి వీసాల ద్వారా మెరుగైన వేతనాలను అందించేలా ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రంప్‌ సర్కార్ ప్రకటించింది. భారత్ సహా, వివిధ దేశాలనుంచి ప్రతీ ఏడాది హెచ్‌ 1బీ వీసా కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తూ ఉంటాయి. వీటిలో కంప్యూటర్‌ లాటరీ ద్వారా 65 వేల మందిని ఎంపిక చేసి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పద్దతిలో విదేశాలకు చెందిన అభ్యర్ధులు చౌకగా దొరుకుతుండడంతో అమెరికా యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతోందంటూ ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తోంది. దీనికి బదులుగా ఎక్కువ నైపుణ్యం ఉండి, ఎక్కువ జీతాలకు పని చేసే ఉద్యోగులకు మాత్రమే హెచ్‌1బీ వీసాను జారీచేసేలా చర్యలు  చేపట్టనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement