
అమెరికాలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటన
రక్షణ సహకారంపై యూఎస్ సైనికాధికారులతో చర్చలు
వాషింగ్టన్: అమెరికా–పాకిస్తాన్ మధ్య రక్షణ బంధం క్రమంగా బలోపేతం అవుతోంది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన అపరేషన్ సిందూర్‌లో భారీగా నష్టపోయిన పాక్ సైన్యం అమెరికాకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్(పీఏఎఫ్) చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇదొక ఉన్నత స్థాయి పర్యటన.
పాకిస్తాన్ వైమానిక దళం అధినేత అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ఇటీవల ఘనమైన ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో పర్యటనలో భాగంగా జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా అత్యున్నత సైనికాధికారులతో, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు.
యూఎస్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ అల్విన్‌ను కలుసుకున్నారు. విస్తృతంగా చర్చలు జరిపారు. అమెరికాతో రక్షణ సహకారం పెంపొందించుకోవడం, కలిసి పనిచేయడం, టెక్నాలజీ ఆధారిత సైనిక మారి్పడి వంటి అంశాలపై చర్చించినట్లు సమాచారం. జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ పర్యటనతో అమెరికా–పాక్ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం, పరస్పర ప్రయోజనాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశిస్తున్నట్లు పాకిస్తాన్ వైమానిక దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఇదొక కీలక మైలురాయి అని అభివరి్ణంచింది.
తమ వైమానిక దళాన్ని ఆధునీకరించాలని పాకిస్తాన్ నిర్ణయానికొచ్చింది. ఇందుకోసం అమెరికా సాయాన్ని అర్థిస్తోంది. అమెరికా నుంచి 70 ఎఫ్–16 బ్లాక్ ఫైటర్‌జెట్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఏఐఎం–7 స్పారో ఎయిర్–టు–ఎయిర్ మిస్సైళ్లు, ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ బ్యాటరీలు సమకూర్చుకోవాలని భావిస్తోంది. చైనా ఇచ్చిన ఆయుధాలపై ఆధారపడడం క్షేమంకాదని ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు తెలిసొచ్చింది. అందుకే అమెరికా ఆయుధాలపై దృష్టి పెట్టింది. అందుకు అమెరికా సైతం సానుకూలంగా స్పందిస్తుండడం చర్చనీయాంశంగా మారతోంది.